అమరావతి : దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ కు తరలించకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇవాళ ఆయన సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరా, నిల్వలపై ఆరా తీశారు. పౌర సరఫరాల శాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధానంగా గృహ వినియోగానికి వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆస్పత్రులు, స్కూళ్లు, దేవాలయాలకు నిరంతర సరఫరా ఉండాలని స్పష్టం చేశారు.
ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రంలోని ఎల్పీజీ నిల్వలు, బుకింగ్, సరఫరా వంటి అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సమావేశానికి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఓఎన్జీసీతోపాటు భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ సహా గ్యాస్ సరఫరా కంపెనీల ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,209 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ స్టాక్ అందుబాటులో ఉందన్నారు మంత్రి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన హెచ్ పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్ లకు చెందిన 1154 ఏజెన్సీల నుంచి గ్యాస్ సరఫరా అవుతోందని వివరించారు. ఎల్పీజీ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ కు తరలి పోకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇదే సమయంలో ఎప్పటిప్పుడు గ్యాస్ సరఫరా, నిల్వల గురించి ఆరా తీయాలని, సమీక్ష చేపట్టాలని మంత్రి నాదెండ్ల మనోహర్ కు సూచించారు నారా చంద్రబాబు నాయుడు.
