హైదరాబాద్ : నూతన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన కోదండ రాం రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్ప లేదని, తాను ఏనాడూ అడగ లేదన్నారు. ప్రభుత్వ పదవులు, నామినేటెడ్ పోస్టులు కావాలని అడుగుతున్నాం అన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని, కాంగ్రెస్ సర్కార్ పాలనలో పరిమితికి మించి అపరిమితమైన స్వేచ్ఛ ఉందన్నారు. గతంలో కేసీఆర్ బీఆర్ఎస్ పాలనా కాలంలో ఎవరినైనా కలవాలంటే భయపడే పరిస్థితి ఉండేదన్నారు.
ఎవరి దగ్గరకైనా వెళ్ళాలంటే ఇంట్లోనే ఫోన్ పెట్టి, జాగ్రత్తగా రమ్మని చెప్పేవాళ్ళు అన్నారు. భయం అంటే ఏంటో గత ప్రభుత్వం చూపెట్టిందని మండిపడ్డారు. ఇన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ చేసేవాళ్ళు అని ఆరోపించారు.
అమరుల స్పూర్తి యాత్ర చేస్తామంటే కూడా గతంలో పర్మిషన్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కోదండరాం రెడ్డి. అయితే ఏ పార్టీ అయినా ప్రజలకు దగ్గరగా ఉండాలని, దూరంగా ఉంటే బతక లేదన్నారు. కేసీఆర్ అందుకే బయటకి వస్తున్నాడని ఎద్దేవా చేశారు. మేం సరిగ్గానే ఉన్నాం, ప్రజలే మారాలని కేసీఆర్ ఆలోచిస్తున్నాడని అన్నారు. కుటుంబ లోపాలను కవిత బయట పెడుతోందన్నారు. .పార్టీ అంటే కుటుంబమే అని కవిత చెప్పకనే చెబుతోందని పేర్కొన్నాడు కోదండ రాం రెడ్డి. ఓట్లు, సీట్లు కావాలంటే పార్టీని వేరేలా నడపాలన్నారు. మేం మార్పు కోసమే పార్టీ నడుపుతున్నాం అన్నారు. అన్నిసార్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండలేం అన్నారు.
