విజయవాడ : ఏపీలో ఫెర్టిలిటీ రేట్ పెరగాల్సిన అవసరం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. విజయవాడలో జరిగిన వరల్డ్ పాపులేషన్ డే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.2026 ఏడాది చరిత్రలో శాశ్వతంగా నిలిచి పోయేలా నిర్ణయాలు తీసుకుంటున్నాం అన్నారు. పిల్లలే సంపద కార్యక్రమానికి ఇవాల్టి నుంచే నాంది పలుకుతున్నాం అన్నారు సీఎం. దేశమంటే మట్టికాదోయ్- దేశమంటే మనుషులోయ్ అని గురజాడ చెప్పిన మాటల్ని మరోమారు గుర్తు చేసుకోవాల్సిన అవసరం వచ్చేసిందన్నారు. జనాభా నియంత్రణ కాదు జనాభా సంరక్షణ కార్యక్రమాల్ని ప్రభుత్వం చేపడుతుందని చెప్పారు. గతంలో జనాభా నియంత్రణపై ఆలోచన చేశాం. దానికి అనుగుణంగా ప్రభుత్వాలు కార్యక్రమాలు చేపట్టాయి అని అన్నారు. మహిళల్లో అక్షరాస్యత పెరిగితేనే జనాభా నియంత్రణ సాధ్యమని అప్పట్లో ఆలోచన చేశామని తెలిపారు చంద్రబాబు నాయుడు.
స్థానిక సంస్థల్లో ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటే పోటీకి అనర్హత అనే నిబంధనలు కూడా పెట్టారన్నారు. ఒక్కరు ముద్దు, ఇద్దరితో సరి, ముగ్గురు వద్దు అనే లాంటి ప్రచారాలు కూడా చేశామని పేర్కొన్నారు సీఎం. 20 ఏళ్ల క్రితం ఐటీ లాంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని సంపద సృష్టించామని తెలిపారు. ఇప్పుడు ప్రపంచంలోని ఏ దేశానికి వెళ్లినా తెలుగువాళ్లు ఉంటారు. ఎక్కువ ఆదాయం సంపాదించేది కూడా మనవారేనని చెప్పారు. అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నాను. జనాభా నిర్వహణ గురించి కూడా చర్చిస్తున్నాం అన్నారు. ఆడబిడ్డల్ని చదివిస్తేనే కుటుంబానికి ఆస్తి, గతంలో వరకట్నం ఉండేది.. ఇప్పుడు ఎదురుకట్నం అనే పరిస్థితి వచ్చిందన్నారు.
















