అమరావతి : రాష్ట్రం అల్లకల్లోలంగా ఉండాలి, అభివృద్ధి జరగకూడదు, పెట్టుబడులు రాకూడదు… ప్రజల్లో గందరగోళం, అభద్రతా భావాన్ని కొనసాగించాలనే దురుద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి జగన్ తన రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలకు అవకాశం ఉందని కానీ అంతకు మించి నాలుగు, ఐదు జిల్లాల నుండి రౌడీలను, అసాంఘిక శక్తులను నిరసనలకు రప్పించడం, పాఠాలు చెప్పే ఉపాధ్యాయులపై దాడులు చేయడం అత్యంత హేయం అన్నారు. తెనాలిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అరాచకానికి, అవినీతికి జగన్ నాంది పలికారన్నారు. రాష్ట్రంలో గందరగోళం, అశాంతి, అస్తవ్యస్త పరిస్థితులను సృష్టించడమే లక్ష్యంగా వైసీపీ నిరసనల పేరుతో విధ్వంసం సృష్టిస్తోందని ఆరోపించారు . ప్రతిసారీ అసాంఘిక శక్తులను రంగంలోకి దించి, రాష్ట్ర ప్రజలను భయాందోళనలకు గురి చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
కోవిడ్ సమయంలో, పాఠాలు చెప్పే ఉపాధ్యాయులను మద్యం దుకాణాల్లో అమ్మకాల కోసం వినియోగించిన చరిత్ర జగన్ రెడ్డికి ఉందన్నారు. పాఠాలు బోధించే ఉపాధ్యాయుల పట్ల ఎప్పుడూ గౌరవం లేదన్నారు. డీఎస్సీ అంశంపై చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నప్పటికీ వైసీపీ నేతలు ఆ అవకాశాన్ని వినియోగించు కోకుండా గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు నాదెండ్ల మనోహర్. కనీసం ఏపీపీఎస్సీకీ డీఎస్సీకి మధ్య తేడా తెలియని జగన్ ను చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ అంశాలపై బహిరంగ చర్చకు వస్తే స్వాగతిస్తాం అన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించే అవకాశాన్ని కూడా జగన్ వినియోగించు కోవడం లేదన్నారు. ప్రజల్లో గందరగోళం సృష్టించడం వైకాపాకు నిత్యకృత్యంగా మారిందన్నారు. డీఎస్సీ అంశంపై జగన్ అడిగే ప్రతి ప్రశ్నకు సరైన ఆధారాలతో సమాధానం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.
