మ‌త్స్య‌కారుల సంక్షేమం ఏపీ స‌ర్కార్ ల‌క్ష్యం

రూ.262 కోట్లను పంపిణీ చేసిన సీఎం చంద్ర‌బాబు

hellotelugu-APCM

నెల్లూరు జిల్లా : తీర ప్రాంత అభివృద్ధిలో మత్స్య కారులకు భాగస్వామ్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మత్స్య కారుల సంక్షేమానికి.. వారి జీవన ప్రమాణాలు మెరుగు పర్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని సీఎం వెల్లడించారు. కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని అలాంటి వారు చేసే ఫేక్ ప్రచారాలను పట్టించు కోవద్దని స్పష్టం చేశారు. నెల్లూరు కావలి నియోజకవర్గం తుమ్మలపెంట గ్రామంలో మంగళవారం మత్స్య కారుల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. వేట నిషేధ సమయంలో 1,30,796 మంది మత్స్య కార కుటుంబాలకు రూ. 261.50 కోట్ల ఆర్ధిక సాయాన్ని అందించారు. మత్స్య కారుల సేవలో కార్యక్రమంతో మత్స్య కారుల కుటుంబానికి రూ.20 వేలు చొప్పున ఆర్ధిక సాయాన్ని అందించారు. సీఎం ప్రసంగిస్తున్న సమయంలోనే మత్స్య కారుల సేవలో లబ్దిదారుల ఖాతాల్లోకి నిధులు జమ అయ్యాయి. దీంతో తమకు డబ్బులు జమ అయ్యాయంటూ సంతోషం వ్యక్తం చేస్తూ సెల్ ఫోన్లల్లో వచ్చిన మెసేజీలను ముఖ్యమంత్రికి లబ్దిదారులు చూపించారు.

ఈ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ సముద్ర తీర ప్రాంతంలో పోర్టులు వస్తే అభివృద్ధి జరుగుతుంద‌ని చెప్పారు. తీర ప్రాంతంలో జరిగే అభివృద్ధిలో మత్స్య కారులకూ భాగస్వామ్యం ఉండాలన్నారు. అభివృద్ధిని మత్స్య కారులు అందిపుచ్చుకునేలా ప్రణాళికలు చేస్తాం అని ప్ర‌క‌టించారు. కావలి ప్రాంతంలో సాగర్ డిఫెన్స్ సంస్థ ఏర్పాటు అవుతోందని వెల్ల‌డించారు. దీని ద్వారా స్థానికులకే ఉపాధి, ఉద్యోగాలు లభిస్తాయ‌న్నారు సీఎం. రూ.288 కోట్లతో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపడుతున్నాం అన్నారు. మత్స్య కారులను ఆర్ధికంగా బలోపేతం చేసేలా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం అని ప్ర‌క‌టించారు. వీటిపై కొందరు అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలకూ తావులేద‌న్నారు. ఫేక్ ప్రచారాలను నమ్మ వద్దు. ఈ తీరం మనది, బోటూ మనదే.. ఇక్కడ సంపద కూడా మనదే. ఈ విషయంలో రాజీ లేదన్నారు.

Exit mobile version