రేపే వెలిగొండకు కృష్ణమ్మ పరుగులు

మార్కాపురం జిల్లాలో వెలిగొండ పండుగ

hellotelugu-Veligonda

అమ‌రావ‌తి : సుదీర్ఘ కాలంగా వేచి చూస్తున్న రైతులు, ప్ర‌జ‌ల క‌ల తీర‌నుంది. భారీ ఖ‌ర్చుతో నిర్మించిన వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్ -1 ను సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమ‌వారం మార్కాపురం జిల్లాలో ప్రారంభించ‌నున్నారు. ఇప్ప‌టికే భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. కరవు నేల చరిత్రలో సువర్ణ అధ్యాయంగా వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం మార‌నుంది. వెలిగొండ ప్రాజెక్టు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు లక్షలాది మంది రైతులు. శ్రీశైలం బ్యాక్‌ వాటర్ నుంచి వెలిగొండకు ఇక కృష్ణా జలాల పరవళ్లు తొక్క‌నున్నాయి. ఫీడర్ కెనాల్ గేట్లు ఎత్తి నల్లమల సాగర్‌కు 10.7 టీఎంసీల నీరు విడుదల చేయనున్నారు సీఎం. చంద్రబాబు చేతుల మీదుగానే వెలిగొండకు శంకుస్థాపన జ‌రిగింది. ఆయ‌న చేతుల మీదుగా నేడు ప్రారంభోత్స‌వం చేయ‌డం విశేషం. ప్రకాశం, మార్కాపురం జిల్లా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు నారా చంద్ర‌బాబు నాయుడు.

కరవు నేలకు కృష్ణమ్మను తెస్తున్న చంద్రబాబుకు కృతజ్ఞతలు చెబుతోంది ఇక్క‌డి రైతాంగం. వెలిగొండ పండుగతో కళకళ లాడుతోంది ప్రతి గ్రామం. మూడు దశాబ్దాల కలను సాకారం చేసి చూపించారు. పోలవరం తరహాలోనే వెలిగొండపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు ఆయ‌న‌. కలగా మిగిలి పోతుందనుకున్న వెలిగొండను కళ్ల ముందుకు తెచ్చి సంతోషాన్ని నింపారు. రెండేళ్లలో వెలిగొండపై రూ.2,400 కోట్లకు పైగా ఖర్చు పెట్టింది కూటమి ప్రభుత్వం. సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్ట‌డ‌మే కాదు పూర్తి చేసి ప్రారంభోత్సవాలు చేస్తున్న అరుదైన అవకాశం దక్కించుకున్నారు చంద్రబాబు నాయుడు. వెలిగొండతో ప్రకాశం, మార్కాపురం జిల్లాల రైతాంగానికి కొత్త భరోసా. కృష్ణమ్మ రాకతో కరవు నేలలో కొత్త ఆశలు నెల‌కొన్నాయి. తీవ్రమైన ప్లోరైడ్ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న పశ్చిమ ప్రకాశం జిల్లా వాసులు. వెలిగొండ పూర్తితో ఇక సాగు, తాగునీటికి తొలగనున్నాయి ఇబ్బందులు. ఇంటింటికీ కుళాయి ద్వారా తాగు నీటి సరఫరాకు శ్రీకారం చుట్టారు.

ఇక నిర్వాసితుల కుటుంబాలకు వేగంగా పరిహారం అందించింది ప్రభుత్వం. మూడు విడతల్లోనే 6,206 కుటుంబాలకు రూ.768 కోట్లు పంపిణీ చేశారు. 2019 తర్వాత 18 ఏళ్ల నిండిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు సీఎం. నిర్వాసిత మహిళలను గౌరవించేలా చీర, పసుపు, కుంకుమ, గాజులు అందించాలని సీఎం ఆదేశాలు చేశారు. నిర్వాసితులకు చెందిన 4,933 పశువులకు 30 రోజుల పాటు దాణా అంద జేస్తారు. 10 వేల మందికి 25 కిలోల బియ్యం, కిలో పప్పు, కిలో చక్కెర, లీటర్ నూనె, 2 కిలోల ఉల్లిపాయలు, 2 కిలోల బంగాళా దుంపలతో నిత్యవసరాల కిట్ కూడా ఇస్తారు.

 

Exit mobile version