చంద్ర‌బాబు క‌ష్టానికి ప్ర‌తిఫ‌ల‌మే వెలిగొండ ప్రాజెక్టు

నిప్పులు చెరిగిన‌ దేవినేని ఉమామ‌హేశ్వ‌ర్ రావు

hellotelugu-VeligoondaProject

విజ‌య‌వాడ : మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర్ రావు నిప్పులు చెరిగారు. మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఆధారాలు లేకుండా మాట్లాడ‌టం మాజీ సీఎంకు ఓ అల‌వాటుగా మారింద‌న్నారు. మూడు దశాబ్దాల చంద్రబాబు కష్టానికి ప్రతిఫలమే వెలుగొండ ప్రాజెక్టు అని అన్నారు. జ‌గ‌న్ పాల‌న‌లో రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించార‌ని, అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేశార‌ని, అందుకే జ‌నం 11 సీట్ల‌కే ప‌రిమితం చేశార‌ని , బుద్ది రావ‌డం లేద‌న్నారు దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర్ రావు. పదవులు శాశ్వతం కాదు జగన్.. చేసిన అభివృద్ధే శాశ్వతంగా నిలిచి పోతుంద‌న్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి బాధ్యతను మరిచి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడటం దుర్మార్గం అని పేర్కొన్నారు. త‌న ఐదేళ్లలో జగన్ రెడ్డి చేసిన అరాచకాలపై ప్రచురించిన పుస్తకాలను ఒక్కసారి చదువు కోవాల‌ని హిత‌వు ప‌లికారు మాజీ మంత్రి.

ముఖ్యమంత్రి చంద్రబాబు 48 ఏళ్ల అనుభవాలను ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకుంటే నీవు చేసే పిల్ల చేష్టలు ప్రజలు చూసి న‌వ్వుకుంటున్నార‌ని అయినా మార‌డం లేద‌న్నారు. పులివెందులకు నీళ్లు ఎవరు ఇచ్చారో, ఎలా వచ్చాయో రైతులు, ప్రజలను అడిగితే చెప్తారన్నారు దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర్ రావు. జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఇరిగేషన్‌, వ్యవసాయ రంగాలు పూర్తిగా దెబ్బ తిన్నాయ‌ని పేర్కొన్నారు. బీసీలపై చేసిన అరాచకాలను మరిచి పోయి నేడు కపట ప్రేమ చూపిస్తూ శ్రీరంగ నీతులు చెప్పడం జగన్‌కే చెల్లిందంటూ ఎద్దేవా చేశారు. పారదర్శకంగా జరిగిన డీఎస్సీపై విషం చిమ్మాలని జగన్‌ చేసిన కుట్రలను ఉపాధ్యాయులు తిప్పికొట్టారని అన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల నుంచి చుక్క నీరు రాక పోయినా కృష్ణా డెల్టాను కాపాడుకున్నామంటే అది చంద్రబాబు దార్శనికతకు నిదర్శనం అన్నారు.

పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజీకి వచ్చిన 30 టీఎంసీల నీరు చూసైనా జగన్‌లో మార్పు వస్తుందని అనుకుంటే.. ఒక్క మంచి మాట కూడా మాట్లాడలేక పోయారంటూ మండిప‌డ్డారు. వెలిగొండ, తోటపల్లి సహా రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు వాటిని పూర్తి చేసిన ఘనత చంద్రబాబుదేన‌ని పేర్కొన్నారు దేవినేని ఉమామ‌హేశ్వ‌ర్ రావు. నేడు నిర్వాసితుల గురించి మాట్లాడుతున్న జగన్‌.. నాడు ప్రాజెక్టును జాతికి ఎలా అంకితం చేశారో గుర్తు చేసుకోవాలని అన్నారు.
పోలవరం ప్రాజెక్టును ఐదేళ్లపాటు నాశనం చేశారని ఆరోపించారు.

Exit mobile version