అమరావతి : నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా హోం మంత్రి అనిత హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. లోకేష్ క్రమశిక్షణ, నిబద్ధతతో పాటు కార్యకర్తలపై ప్రేమాభిమానాలు కలిగిన నాయకుడని ఆమె పేర్కొన్నారు. యువగళంతో మొదలై, నవగళంగా విస్తరించి పార్టీ శ్రేణుల్లో చైతన్యాన్ని రగిల్చిందని, కార్యకర్తలను సైనికులుగా తీర్చిదిద్దిన తెలుగుదేశం సేనాని అని కొనియాడారు వంగలపూడి అనిత. మహిళలు, యువతకు పార్టీలో పెద్దపీట వేస్తూ ,యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో లోకేష్ ముందున్నారని తెలిపారు. 44 సంవత్సరాల క్రితం పార్టీ ఉన్న విలువలను కొనసాగిస్తూ అదే దిశలో ముందుకు నడిపిస్తున్న యువ నాయకుడని అభిప్రాయపడ్డారు.
తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడానికి లోకేష్ కృషి చేస్తున్నారని, తెలుగు జాతి ఉన్నంత వరకు పార్టీ కొనసాగుతుందన్నారు. ఇదే సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పల్లా శ్రీనివాస్ కు, అలాగే పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు. తనకు రెండోసారి పొలిట్ బ్యూరో సభ్యురాలిగా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, మంత్రి లోకేష్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు తన జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజుగా పేర్కొన్న ఆమె, తెలుగుదేశం పార్టీ తనకు పుట్టినిల్లు వంటిదని తెలిపారు. ఇలాంటి ఉన్నతమైన పదవి దక్కడం తనకు అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొంటూ, జీవితాంతం పార్టీకి రుణపడి ఉంటానని అన్నారు. పార్టీ మరింత బలోపేతం కావడానికి తన వంతు కృషి చేస్తానని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు.


















