హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు రానున్నాయి. ఇందుకు సంబంధించి కీలక ప్రకటన చేసింది ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్రంలోని కార్పొరేషన్ మేయర్లు , మున్సిపల్ చైర్‌పర్సన్‌లకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. మహిళలకు ఖుష్ కబర్ చెప్పింది ప్రభుత్వం. ఏకంగా 50 శాతం రిజర్వేషన్లు వారి కోసం కేటాయించింది. జీహెచ్ఎంసీ, అనేక ప్రధాన పౌర సంస్థలు మహిళా అభ్యర్థులకు వరంగా మారనున్నాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ శ్రీదేవి రాష్ట్ర వ్యాప్తంగా 50 శాతం పదవులను మహిళలకు రిజర్వ్ చేసినట్లు ప్రకటించారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 121 మునిసిపాలిటీలలో రిజర్వేషన్లు కేటాయించడం జరిగిందన్నారు. వాటిలో షెడ్యూల్డ్ తెగల కోసం 5 సీట్లు, షెడ్యూల్డ్ కులాల కోసం 17 సీట్లు, వెనుకబడిన తరగతుల కోసం 38 సీట్లు కేటాయించామన్నారు.
కొత్తగూడెం కార్పొరేషన్ ఎస్టీ జనరల్ కు, రామగుండం ఎస్సీ జనరల్ , మహబూబ్ నగర్ బీసీ కోసం, మంచిర్యాల బీసీ, కరీంనగర్ బీసీ లకు రిజర్వు చేశామని తెలిపారు డైరెక్టర్ శ్రీదేవి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మహిళలకు కేటాయించామన్నారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌ను జనరల్ కేటగిరీ కింద ఉంచామన్నారు, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ కార్పొరేషన్‌లను మహిళలకు (జనరల్) రిజర్వ్ చేసినటట్లు తెలిపారు శ్రీదేవి. ఇదిలా ఉండగా తెలంగాణ అంతటా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను రూపొందించడంలో రిజర్వేషన్లు కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు.
















