న్యూఢిల్లీ : క్యాంపస్ ఎన్నికల సంస్కరణలపై పిటిషన్‌ను స్వీకరించడానికి భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్‌ను ప్రచార ప్రయోజన వ్యాజ్యంగా పేర్కొంటూ సీరియస్ అయ్యారు సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. బయటకు వెళ్లి ఇతరులను (మీడియా) ఉద్దేశించి ప్రసంగించాలని అనుకుంటున్నారు. ప్రచారం కోసం మాత్రమే తప్పా మరోటి కాదన్నారు. కళాశాలలు, విశ్వ విద్యాలయాలలో విద్యార్థి సంఘాల ఎన్నికలకు నియంత్రణ చట్రాన్ని నిర్దేశించే 2006 లింగ్డో కమిటీ నివేదికను అమలు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్రం మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ J.M. లింగో నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది, దీని నివేదిక 2006లో సమర్పించడం జరిగింది. విద్యా ప్రమాణాలను కొనసాగిస్తూనే క్యాంపస్ రాజకీయాల నుండి డబ్బు, కండ బలాన్ని తొలగించడానికి సిఫార్సులు చేసింది. శివ్ కుమార్ త్రిపాఠి దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించడానికి భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ , జస్టిస్ జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. దీనికి అర్హత లేదని గమనించింది. విద్యార్థి సంఘాలకు నిష్పాక్షికమైన ఎన్నికలు జరిగేలా కమిటీ నివేదికను అమలు చేయాలని పిటిషన్ కోరిందని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు.
