రాష్ట్రంలో రైతన్నల పరిస్థితి ఆగ‌మాగం : కేటీఆర్

కాంగ్రెస్ స‌ర్కార్ నిర్వాకం కార‌ణంగా ఇబ్బంది

hellotelugu-KTR

హైద‌రాబాద్ : రాష్ట్రంలో రైతన్నల పరిస్థితి ఆగ‌మాగంగా మారింద‌న్నారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ భ‌వ‌న్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ దారులకు ఇచ్చే అన్ని పథకాలను కాంగ్రెస్ ఆపి వేసిందన్నారు. తాము 11 సార్లు రైతు భరోసా ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే సారి ఇచ్చి చేతులు దులుపుకుందని ఆరోపించారు. ఈరోజు యూరియా గురించి అడిగితే ప్రభుత్వం పట్టించు కోవడం లేద‌ని, దీంతో రైతులు రోడ్ల పాల‌య్యార‌ని ఆవేద‌న చెందారు కేటీఆర్. షాపుల్లో లేని యూరియాను మొబైల్ యాప్స్ తో ఇస్తామని చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. కొత్తగా యూరియా కార్డ్ అంటూ నాటకం మొదలుపెట్టిందని మండిపడ్డారు.

రైతన్నలకు యూరియా దొరకక లైన్లో నిలబడి యుద్ధాలు చేసుకునే పరిస్థితి వచ్చిందని, దీనికి కాంగ్రెస్ అస‌మ‌ర్థ పాల‌న‌కు నిద‌ర్శ‌న‌మ‌ని ఆరోపించారు కేటీఆర్.చెప్పులు లైన్లో పెట్టి కుటుంబమంతా ఒక్క బస్తా యూరియా కోసం నిలబడుతుండ‌డం ప‌ట్ల వాపోయారు. గ్యారంటీ కార్డులకే దిక్కులేదు.. కొత్తగా యూరియా కార్డు ఇచ్చి కాంగ్రెస్ ఏం చేస్తుందంటూ ప్ర‌శ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో క్రాప్ హాలిడేలు ప్రారంభమయ్యాయని తెలిపారు. గతంలో మా ప్రభుత్వం లో యూరియా కోసం కుస్తీ లేదు.. విత్తనాల కోసం పోటీ లేదు.. కరెంటు కష్టాలు లేవు.. క్రాప్ హాలిడేలు లేనే లేవ‌న్నారు కేటీఆర్.

Exit mobile version