పోలీస్ అమ‌ర‌వీరుల త్యాగాలు చిర‌స్మ‌ర‌ణీయం

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు

hellotelugu-ChandraBabu

 

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పోలీసు అమ‌ర‌వీరుల త్యాగాలు చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌ని, శాంతి భ‌ద్ర‌త‌ల‌ను ప‌రిర‌క్షించ‌డంలో కీల‌క పాత్ర పోషించార‌న్నారు. బుధ‌వారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమర వీరులకు నివాళులు అర్పించారు. ప్రజారక్షణలో ప్రాణాలు త్యాగం చేసిన వారికి సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. మాతృభూమి రక్షణ, ప్రజారక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వారిని గౌరవించుకునే సందర్భం ఇద‌న్నారు. 1959 అక్టోబర్ 21న లడఖ్‌లో చైనా సైనికుల దాడిని తిప్పికొడుతూ 10 మంది పోలీసులు వీరమరణం పొందారు. దానికి గుర్తుగా ఇదే రోజును పోలీస్ అమరవీరుల సంస్మరణ దినంగా జరుపుకుంటున్నాం అని అన్నారు. ఖాకీ అంటే బాధ్యత-పోలీసు అంటే భరోసా. ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టే పోలీసు వృత్తి ఎంతో గొప్పదని అన్నారు చంద్ర‌బాబు నాయుడు.

ఆపదలో ఉన్నవారికి పోలీసులే ధైర్యం, స్థైర్యం. ప్రమాదం జరిగినా, నేరం జరిగినా ముందుగా గుర్తుకొచ్చేది పోలీసులేన‌ని అన్నారు. ఎప్పుడు చూసినా విధుల్లో ఉండి ప్రజల కోసం సేవ చేసే ఒకే ఒక విభాగం పోలీసు విభాగం అని పేర్కొన్నారు. దుర్గ గుడి శరన్నవరాత్రులు అయినా విజయవాడ ఉత్సవ్ అయినా, నిర్వహణలో మీరే కీలకం అని చెప్పారు . విఐపిల భద్రత అయినా, సమాజంలో శాంతి భద్రతలు అయినా పోలీసులు ఉంటేనే సాధ్యం అవుతుంద‌న్నారు. ప్రజల ఇళ్లలో పండుగ వెలుగులు నింపేందుకు, .తమ ఇంటి పండుగలను దూరం చేసుకుంటారని అన్నారు సీఎం. అమరులైన పోలీసుల త్యాగాలను ఇలా స్మరించుకోవడం కేవలం సానుభూతి కాదు. అది మన బాధ్యత అని స్ప‌ష్టం చేశారు .ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నారు. క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడంలో, నేరాలను ఛేదించడంలో మంచి ట్రాక్ రికార్డ్ ఉందని ప్ర‌శంసించారు. నాడు ఫ్యాక్షన్ ను నియంత్రించడంలో, తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో, మత కలహాలను అరికట్టడంలో, ఎందరో అధికారులు, సిబ్బంది అసాధారణమైన ధైర్యాన్ని ప్రదర్శించారని కొనియాడారు.

Exit mobile version