అమరావతి : పులి కేవలం మన జాతీయ జంతువు మాత్రమే కాదు, మన దేశ అటవీ సంపదకు, జీవ వైవిధ్యానికి, పర్యావరణ సమతుల్యతకు ప్రతీక. పులులను సంరక్షించడం అంటే మన అడవులను, జల వనరులను, వన్యప్రాణులను, భావితరాలకు అందించాల్సిన సహజ వారసత్వాన్ని కాపాడు కోవడమేనని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రపంచ పులుల దినోత్సవం సందర్బంగా ఇవాళ ఆయన స్పందించారు. 2010లో పులుల సంరక్షణ కోసం అంతర్జాతీయ సమాజం తీసుకున్న సంకల్పాన్ని మనకు గుర్తు చేస్తుందన్నారు. అదే సమయంలో పులుల పరిరక్షణలో మన దేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన తీరును ప్రస్తావించారు. ప్రాజెక్ట్ టైగర్ వంటి దూరదృష్టితో కూడిన కార్యక్రమాల ఫలితంగా నేడు ప్రపంచంలోని పులులలో దాదాపు 75 శాతం మన దేశంలో నివసిస్తున్నాయని తెలిపారు పవన్ కళ్యాణ్. ఇది భారతదేశం సాధించిన అపూర్వ పర్యావరణ విజయానికి నిదర్శనం అని పేర్కొన్నారు.
దేశంలోనే అతి పెద్ద పులుల సంరక్షణ ప్రాంతమైన నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఆంధ్రప్రదేశ్‌లో ఉండటం మనందరికీ గర్వ కారణం అని అన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో 5,442.83 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ రిజర్వ్- పులులతోపాటు చిరుతలు, ఎలుగుబంట్లు, అడవి కుక్కలు, శాకాహార జంతువులు, వందలాది వన్యప్రాణులకు సురక్షిత ఆవాసంగా నిలుస్తోందని తెలిపారు. తాజా అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని NSTR–శేషాచలం పరిధిలో 68 పులులు, 11 పులి పిల్లలు నమోదు కావడం సంతోషకర విషయం అన్నారు పవన్ కళ్యాణ్ కొణిదల. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంరక్షణ చర్యలకు నిదర్శనమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పులుల సంరక్షణ కోసం అనేక శాస్త్రీయ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం అని వెల్లడించారు. వేట నిరోధక వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు గడ్డి మైదానాల అభివృద్ధి, వేట జంతువుల సంఖ్య పెంపు వంటి చర్యలను చేపట్టాం అన్నారు.

















