అమరావతి : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా భారత దేశంపై గతంలో విధించిన టారిఫ్ లను తగ్గిస్తున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ నిర్ణయంపై స్పందించారు మంత్రి. దీని కారణంగా భారత దేశానికి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరింత మేలు చేకూరే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు అచ్చెన్నాయుడు. అమెరికా ప్రభుత్వం భారతీయ సముద్ర ఆహార ఎగుమతులపై విధించిన టారిఫ్‌ను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడాన్ని స్వాగతిస్తున్నాం అన్నారు.
రాష్ట్రంలోని సముద్ర ఆహార ఎగుమతిదారులకు, ముఖ్యంగా ఆక్వా రంగానికి గణనీయమైన ఉపశమనం లభిస్తుందని చెప్పారు. అధిక టారిఫ్‌ల కారణంగా గత నెలల్లో తగ్గిన ఎగుమతులు మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. అమెరికా మార్కెట్‌లో భారతీయ ఉత్పత్తుల పోటీ సామర్థ్యం పెరుగుతుందని చెప్పారు. ఫ్రోజెన్ ష్రింప్ సహా సముద్ర ఆహార ఎగుమతులు 10 నుండి 15 శాతం వరకు పెరగడం ఖాయమన్నారు. ప్రాసెసింగ్ రంగంలో లాభ మార్జిన్లు మెరుగవుతాయిని తెలిపారు. ఆక్వా రంగంలో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ఈ టారిఫ్ తగ్గింపు వరంగా మారుతుందని అన్నారు అచ్చెన్నాయుడు, రైతులు, మత్స్యకారులకు ఆదాయ స్థిరత్వం, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.















