ఈరోడ్ : టీవీకే పార్టీ అధ్యక్షుడు దళపతి విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026లో తమిళనాడు రాష్ట్రంలో జరిగే శాసన సభ ఎన్నికల్లో కేవలం రెండు పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం విజయ్ చేసిన కామెంట్స్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎన్నికల పోరు స్వచ్ఛమైన శక్తి టీవీకే, దుష్టశక్తి డీఎంకే మధ్యే ఉండబోతోందని ప్రకటించారు. ఇదిలా ఉండగా గత సెప్టెంబర్ 27న టీవీకే కరూర్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన తర్వాత తమిళనాడులో ఆయన పాల్గొన్న మొదటి బహిరంగ కార్యక్రమం ఇది. తమిళనాడులోని ఈరోడ్‌లో జరిగిన బహిరంగ సభలో తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత విజయ్ ప్రసంగించారు.
ఈ సందర్బంగా తమిళనాడు అధికార డీఎంకేపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు విజయ్. ఆ పార్టీని ఆయన రాష్ట్రం పాలిట దుష్ట శక్తిగా పేర్కొన్నారు. దివంగత ఏఐఏడీఎంకే దిగ్గజాలైన ఎం.జి. రామచంద్రన్ , జె. జయలలిత ద్రవిడ పార్టీని లక్ష్యంగా చేసుకోవడానికి తరచుగా ఉపయోగించిన పదాన్ని ఆయన పునరావృతం చేశారు. తన తమిళగ వెట్రి కజగం (టీవీకే) ఒక ‘స్వచ్ఛమైన శక్తి’ అని మరోసారి స్పష్టం చేశారు విజయ్. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ ప్రధాన పోరు మాత్రం టీవీకే వర్సెస్ డీఎంకే పార్టీల మధ్యే ఉంటుందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. అనంతరం కాంచీపురంలో కొద్దిమందితో రహస్య సమావేశం నిర్వహించారు. దానితో పాటు పొరుగున ఉన్న పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో ఒక ర్యాలీలో కూడా ప్రసంగించారు.
