కళ్యాణదుర్గం : టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న వెంటనే మంత్రి సవిత.. కళ్యాణదుర్గంలోని యర్రంపల్లి గ్రామానికి చేరుకున్నారు. హనుమంతరాయ చౌదరి నివాసానికి చేరుకుని ఆయన భౌతిక కాయానికి టీడీపీ జెండా కప్పి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు.
హనుమంతరాయ చౌదరి మరణం టీడీపీకి తీరని లోటు అని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం లో ఆయన సేవలు అనన్య సామాన్యమన్నారు. హనుమంతరావు చౌదరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, ఆయన కుటుంబానికి మంత్రి సవిత తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి సవిత వెంట ఎమ్మెల్యేలు పరిటాల సునీత, బండారు శ్రావణి ఉన్నారు. వారు కూడా హనుమంతరాయ చౌదరి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంత రాయ చౌదరి మృతి చెందడం పట్ల తీవ్ర సంతాపం తెలిపారు. గొప్ప నాయకుడిని, ప్రజల మనిషిని పార్టీ కోల్పోయిందన్నారు.


















