తూర్పు గోదావరి జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
దక్షిణాదికి, ఉత్తరాది రాష్ట్రాలకు ఆన్యాయం జరుగుతుందని ఏవేవో ఆరోపణలు చేసి సాకులు చెప్పారన్నారు. లేని పోని సాకులతో బిల్లు వీగిపోయేలా చేయటం శోచనీయం అన్నారు. ప్రజలు ఎన్నుకుంటేనే చట్టసభల్లోకి వచ్చిన వారు మహిళలకు ద్రోహం చేయటం సరికాదన్నారు. జనాభాలో 50 శాతంగా ఉన్న మహిళలు ఏ రంగంలో అయినా సమర్ధవంతంగా పని చేస్తున్నారని కితాబు ఇచ్చారు.
అలాంటి మహిళలు చట్ట సభలకు వస్తే న్యాయం జరుగుతుందనే ఈ సవరణ బిల్లు వచ్చిందన్నారు.
మహిళల ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా బిల్లును అడ్డుకోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు నారా చంద్రబాబు నాయుడు. ఆ పార్టీలు చేసిన ద్రోహానికి డిపాజిట్ కూడా రాకుండా చేయాలన్నారు. ఆడబిడ్డలు పైకి వస్తే చూడలేకే ఈ బిల్లును అడ్డుకున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ప్రతీ ఒక్కరిని చైతన్యం చేసేలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతాం అని ప్రకటించారు. బీజేపీ, జనసేన నేతలతో కలిసి నిడదవోలులో నిరసన ర్యాలీలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు ముఖ్యమంత్రి. సీఎంతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, సోము వీర్రాజు, పలువురు నేతలు పాల్గొన్నారు.
