అన్నమయ్య జిల్లా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో తీసుకు వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కోట్లాది మందికి ఉపాధి కల్పించిందన్నారు. కష్ట సమయంలో, కరువు కాలంలో కార్మికులు, కూలీలకు ఉన్న చోటునే పని కల్పించడంతో చాలా మంది ఊపిరి పీల్చుకున్నారని పేర్కొన్నారు. ఆనాడు అనంతపురం జిల్లా వేదికగా ఈ అద్భుతమైన పథకం ప్రారంభమైందని గుర్తు చేశారు షర్మిలా రెడ్డి. కానీ పనిగట్టుకుని గత 11 ఏళ్లుగా దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోదీ బీజేపీ సర్కార్ కావాలని కూలీలు, కార్మికులకు వ్యతిరేకంగా చట్టాన్ని సవరించిందని, ఇందు కోసం ఏకంగా పార్లమెంట్ లో ఆమోదం కూడా తెలిపిందన్నారు.
దీనిని వ్యతిరేకిస్తూ కొత్తగా బీజేపీ రూపొందించిన శ్రామికుల పొట్ట కొట్టేందుకు ఉద్దేశించిన వీబీజీ రామ్ జి చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని షర్మిలా రెడ్డి డిమాండ్ చేశారు. లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఏపీపీసీసీ ఆధ్వర్యంలో మన్రేగా పరిరక్షణ యాత్రకు శ్రీకారం చుట్టారు షర్మిలా రెడ్డి. ఆమెతో పాటు మాజీ మంత్రి నీలకంఠాపురం రఘువీరా రెడ్డి కూడా ఉన్నారు. ఇవాళ అన్నమయ్ జిల్లాకు చేరుకుంది ఈ యాత్ర. భారీ ఎత్తున జనం షర్మిలా రెడ్డికి మద్దతు తెలిపారు. ఆమెకు బ్రహ్మరథం పట్టారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని చేస్తున్న పోరాటానికి పుంగనూరు ప్రజల మద్దతు లభించడం కాంగ్రెస్ పార్టీకి ఎంతో బలాన్ని ఇచ్చిందని అన్నారు షర్మిలా రెడ్డి.

















