అమరావతి : మన మాతృభాష మన సంస్కృతికి, అస్తిత్వానికి మూలస్తంభం అని పేర్కొన్నారు మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు. నేటి డిజిటల్ యుగంలో మన పిల్లలు తెలుగు మాట్లాడ గలుగుతున్నప్పటికీ అక్షరాలను రాయడం, చదవడంలో వెనుక బడుతుండటం గమనించదగిన అంశం అన్నారు. ఈ నేపథ్యంలో మన లిపిని భావితరాలకు మరింత చేరువ చేసేందుకు రూపొందించిన ‘కూల్‌ఫాబెట్స్’ అనువర్తనాన్ని (యాప్‌ను) తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. భారతీయ భాషల ఔన్నత్యాన్ని చాటేలా ఈ యాప్‌ను తీర్చిదిద్దిన వ్యవస్థాపకులు కొల్లు రంజిత్, వెంకట్ ఏలేటి సహా యావత్ బృందానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియ చేస్తున్నానని తెలిపారు. ఆధునిక సాంకేతికతను భాషా పరిరక్షణకు వారధిగా మలచిన ‘కూల్‌ఫాబెట్స్’ బృందం ప్రయత్నాన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకొని, మన పిల్లలలో తెలుగు చదవడం, రాసే నైపుణ్యాలను పెంపొందించాలని సూచించారు. తేనెలొలుకు తెలుగు లిపిని సగర్వంగా కాపాడు కోవాలని ఆకాంక్షించారు.
సాంకేతికత భాషలను దూరం చేయకూడదు, వాటిని పరిరక్షించాలి అనే బలమైన సంకల్పంతో 2016లో బోస్టన్ వేదికగా ప్రారంభమై, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ భాషల్లో చిన్నారుల అక్షరాస్యతను పెంపొందించే గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌గా ఎదుగుతున్న ’కూల్‌ఫాబెట్స్’ అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో చిన్నారులకు అక్షరాల దిద్దడం, గుణింతాలు, పదాలు, వాక్యాల రచనను సులభంగా, ఆట పాటలతో నేర్పించడం, కూల్ఫా సెన్స్ ఫీచర్ ద్వారా పిల్లలు అక్షరాలు రాసే క్రమాన్ని, ఆకారాన్ని గమనించి ఒక వ్యక్తిగత గురువులా మార్గదర్శనం చేసే చొరవ అభినందనీయం అన్నారు. ఇంటర్నెట్ లేకపోయినా పని చేయడం, ప్రకటనలు లేని సురక్షితమైన వాతావరణం కల్పించడం వంటి అంశాలతో, జాతీయ విద్యా విధానం (NEP 2020) ఆశయాలకు అనుగుణంగా ప్రాథమిక విద్యలో మాతృభాషా పునాదిని పటిష్టం చేయడానికి ఈ యాప్ ఎంతగానో దోహద పడుతుందని అన్నారు ముప్పవరపు వెంకయ్య నాయుడు.



















