న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో వైద్య, విద్యా రంగంలో నెలకొన్న ప్రస్తుత సంక్షోభంపై తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాలలో బాగంగా అత్యంత ముఖ్యమైన ప్రజా సమస్యలు ప్రస్తావించే అధికరణ 377 కింద రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించారు. ప్రజల ధనంతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విద్యను విస్తరించాలనే సదుద్దేశంతో 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. కానీ కొత్తగా కొలువు తీరిన కూటమి సర్కార్ వాటిని నిర్లక్ష్యం చేయడం పట్ల ఆవేదన చెందారు.
వీటిలో ఇప్పటికే 7 కాలేజీల నిర్మాణాలు పూర్తయ్యాయని, మరికొన్ని చివరి దశలో ఉన్నాయని ఎంపీ గుర్తు చేశారు . అయితే, నిర్మాణాలు పూర్తయి సిద్ధంగా ఉన్న కాలేజీలకు కూడా అనుమతులు ఇవ్వడంలో జరుగుతున్న అనవసర జాప్యం అత్యంత దురదృష్టకరమని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జాప్యం కారణంగా, ఈ విద్యాసంవత్సరంలో సుమారు 1000కి పైగా ఎంబీబీఎస్ సీట్లను కోల్పోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎంతోమంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరమయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుండటంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారని డాక్టర్ గురుమూర్తి తెలిపారు.
