ఎంకే స్టాలిన్ కు మ‌ద్రాస్ హైకోర్టులో చుక్కెదురు

కోల‌త్తూర్ లో ఓట్ల పునః లెక్కింపు కుద‌ర‌దు

hellotelugu-MadrasHighCourt

చెన్నై : త‌మిళ‌నాడు మాజీ సీఎం, డీఎంకే పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్ కు బిగ్ షాక్ త‌గిలింది. కోలత్తూర్‌లో ఓట్లను పునః లెక్కించాల‌ని కోరుతూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన మ‌ద్రాస్ హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను దాఖ‌లు చేసిన దావాను కొట్టి వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఓటింగ్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఇక్క‌డ గెలుపొందిన‌ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు విజయాన్ని రద్దు చేసి, తనను విజేతగా ప్రకటించాలని స్టాలిన్ తన రిట్ పిటిషన్‌లో కోరారు. 14 ఈవీఎం లు , వీవీప్యాట్ యంత్రాల పరిశీలనలో వ్యత్యాసాలు కనిపించాయని పేర్కొన్నారు స్టాలిన్. ఓటింగ్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని స్టాలిన్ ఆరోపించారు. నియోజకవర్గంలో ఉపయోగించిన అన్ని ఓటింగ్ యంత్రాలను తిరిగి పరిశీలించాలని ఆయన కోరారు. ఓట్ల పునఃలెక్కనతో పాటు, బాబు ఎన్నిక చెల్లదని ప్రకటించి, తనను విజేతగా ప్రకటించాలని కూడా పిటిషన్‌లో కోరారు.

2026 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తన కంచుకోట అయిన కోలత్తూర్ స్థానాన్ని స్టాలిన్, కొత్తగా ఏర్పడిన తమిళగ వెట్రి కళగం అభ్యర్థి వి.ఎస్. బాబు చేతిలో కోల్పోయారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీలో బాబు 8,795 ఓట్ల తేడాతో విజయం సాధించారు. స్టాలిన్ కోలత్తూర్ నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ, వరుసగా నాలుగోసారి ఆ స్థానాన్ని నిలబెట్టు కోలేక పోయారు. అయితే, ఈ ఓటమి ఎదురైనప్పటికీ, డీఎంకే కూటమి 1.54 కోట్ల ఓట్లను సాధించిందని (విజేత పార్టీతో పోలిస్తే కేవలం 3.52 శాతం తేడాతో), ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఫలితాల అనంతరం, తన విజయానికి పార్టీ అధినేత విజయ్ , స్థానిక ప్రజలతో ఉన్న అనుబంధమే కారణమని వి.ఎస్. బాబు పేర్కొన్నారు. అధికారంలో ఉన్న పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత అంశాన్ని ప్రస్తావిస్తూ, తమిళనాడులో మార్పు కోరుకున్న ప్రజల ఆకాంక్షల నేపథ్యంలోనే తన విజయం సాధ్యమైందని బాబు చెప్పారు.

Exit mobile version