హైదరాబాద్ : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన చిత్రం ఆదర్శ కుటుంబం. ఇందులో ముఖ్య పాత్ర పోషించారు విక్టరీ వెంకటేష్, శ్రీనిధి శెట్టి. ఎస్ఎస్ థమన్ అద్బుతమైన సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్ డేట్ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఆదివారం చిత్ర బృందంకీలక ప్రకటన చేసింది. ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం నుండి రెండో పాట ‘మాల’ విడుదల తేదీ ఖరారు చేసింది. టాలీవుడ్లో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం దుర్గాష్టమి (దసరా) కానుకగా విడుదల కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. చిత్ర బృందం అక్టోబర్ 30న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నప్పటికీ, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మరోవైపు ఈ సినిమాలోని రెండో పాట ‘మాల…’ విడుదల తేదీని ప్రకటిస్తూ సోషల్ మీడియాలో ఒక అందమైన పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ పోస్టర్లో ఆదర్శ కుటుంబం నుండి తదుపరి సంగీత విందు కోసం సిద్ధంగా ఉండండి అని పేర్కొన్నారు. రెండో పాట ‘మాల…’ అక్టోబర్ 19న విడుదల కానుంది. ఈ పోస్టర్లో వెంకటేష్ చేతిలో పాతకాలపు టేప్ రికార్డర్‌ను పట్టుకుని, మెడలో మల్లెపూల దండతో చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఇది పోస్టర్‌కు ఒక చక్కని రొమాంటిక్ అనుభూతిని ఇవ్వడమే కాకుండా పాట శీర్షికకు కూడా సరిగ్గా సరిపోయింది. ఇప్పటికే ఈ సినిమాలోని మొదటి పాట ‘నారాయణమ్మ…’ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు రెండో పాట కూడా ప్రేక్షకులను అలరిస్తే, సినిమా విడుదలకు ముందే మంచి హైప్ ఏర్పడే అవకాశం ఉంది.
ఈ చిత్రంలో వెంకటేష్ (చిట్టి బాబు) కుటుంబ సభ్యుల పాత్రలు ‘జెన్-జీ’ తరహాలో చాలా విభిన్నంగా, సరదాగా ఉండబోతున్నాయని సమాచారం. ఈ ఫ్యామిలీ డ్రామాలో శ్రీనిధి శెట్టి, రాజా ప్రజ్వల్, యువిన , నారా రోహిత్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.
