అస‌దుద్దీన్ ఓవైసీ బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పాలి

డిమాండ్ చేసిన టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్

hellotelugu-MaheshKumargoud

హైద‌రాబాద్ : టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిప్పులు చెరిగారు. ఎంఐఎం పార్టీ చీఫ్ , హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ నోరు జార‌డం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం తెలిపారు. ఆయ‌న గాంధీ భ‌వ‌న్ లో ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్య‌క్తి ఇలాగేనా మాట్లాడేది అంటూ ప్ర‌శ్నించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. త‌మ పార్టీకి చెందిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు , సనత్‌నగర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ డాక్టర్ కోట నీలిమపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ అధ్యక్షుడు ఖండించారు. ఇవి అత్యంత అనైతికమైనవని ఆయన పేర్కొన్నారు. ఒవైసీ తన వ్యాఖ్యలను ఉపసంహరించు కోవాలని డాక్టర్ కోట నీలిమకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఉత్తరప్రదేశ్‌లో ఒవైసీ చేపట్టిన రాజకీయ కార్యకలాపాలపై రాజ్యసభ ఎంపీ పవన్ ఖేరా విమర్శలు చేశారని అన్నారు. దానికి సమాధానం ఇవ్వాలనుకుంటే ఒవైసీ రాజకీయ పరమైన అంశాలతోనే స్పందించి ఉండాల్సిందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అలా కాకుండా పవన్ ఖేరా భార్య అయిన డాక్టర్ కోట నీలిమను లక్ష్యంగా చేసుకోవడం దారుణ‌మ‌న్నారు. ఇది దిగ‌జారుడు రాజ‌కీయాల‌ను సూచిస్తుంద‌న్నారు. రాజకీయ చర్చ ఎంతటి నీచస్థాయికి పడిపోయిందో తెలియజేస్తుందని ఆయన విమర్శించారు. డాక్టర్ కోట నీలిమకు రాజకీయ నాయకురాలిగా తనదైన గుర్తింపు, ప్రజా జీవితంలో ప్రత్యేక స్థానం ఉన్నాయి అని టీపీసీసీ అధ్యక్షుడు పేర్కొన్నారు.

పవన్ ఖేరాను విమర్శించే హక్కు ఒవైసీకి ఉంది. ఆయన కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించవచ్చు, మా రాజకీయ విధానాలతో విభేదించవచ్చు. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక మహిళా గౌరవాన్ని కించపరచడం ఏమాత్రం ఆమోద యోగ్యం కాదు అని టీపీసీసీ చీఫ్‌ స్పష్టం చేశారు. ఒవైసీ వెంటనే క్షమాపణలు చెప్పాలని, ప్రజా జీవితంలో మహిళలకు ఉండాల్సిన గౌరవాన్ని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.

Exit mobile version