అమరావతి : అమరావతి రాజధానిలో జర్నలిస్టుల కోసం ప్రతిపాదించిన హౌసింగ్ ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సీనియర్ జర్నలిస్టులు కోరారు. అమరావతి జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అమరావతి జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ కార్యదర్శి పాటిబండ్ల నాగశ్రీనివాసరావు మాట్లాడుతూ 2019లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం జీఓ ఎంఎస్ నెం.67 ద్వారా అమరావతి జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి 30 ఎకరాల భూమిని కేటాయించిందని చెప్పారు. అనంతరం సీఆర్డీఏ ఆధ్వర్యంలో బహుళ అంతస్తుల గృహ సముదాయాల నిర్మాణం కోసం ఆ భూమిని ప్రభుత్వానికి అప్పగిస్తూ ఒప్పందం కుదుర్చుకున్నామని సమావేశంలో గుర్తు చేశారు. అనంతరం జీఓ ఎంఎస్ నెం.107 ద్వారా జర్నలిస్టులకు నాలుగు కేటగిరీల్లో హ్యాపీనెస్ట్ నమూనాలో అపార్ట్‌మెంట్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
సొసైటీ డైరెక్టర్ , విశాలాంధ్ర బ్యూరో చీఫ్ చావా రవి ప్రస్తుతం అమరావతిలో హ్యాపీనెస్ట్‌తో పాటు ఇతర గృహ నిర్మాణ ప్రాజెక్టులు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో జర్నలిస్టుల హౌసింగ్ ప్రాజెక్టును కూడా తక్షణమే ప్రారంభించాలని, దీనిపై ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. అమరావతికి చట్టబద్ధ రాజధాని హోదా కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి సమావేశం కృతజ్ఞతలు తెలిపింది. అలాగే రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించింది. అమరావతిలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఏర్పాటు కావడం, పేదలకు గృహాలు, హ్యాపీనెస్ట్, ఏపీఎన్‌ఆర్‌టీఐ ఐకాన్ ప్రాజెక్టులు వంటి అభివృద్ధి కార్యక్రమాలను స్వాగతిస్తూ, జర్నలిస్టుల హౌసింగ్ ప్రాజెక్టుకు కూడా అదే ప్రాధాన్యం ఇవ్వాలని కోరింది.
2019 నుంచి ఇప్పటి వరకు పలువురు జర్నలిస్టులు పదవీ విరమణ చేయడం, మరికొందరు కరోనా సమయంలో మరణించడం జరిగిందని, వారి కుటుంబాలు కూడా ఈ ప్రాజెక్టు అమలుపై ఆశగా ఎదురు చూస్తున్నాయని సమావేశం పేర్కొంది. అమరావతి అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని, ప్రపంచ స్థాయి రాజధానికి తగిన విధంగా ప్రపంచంలోనే ఆదర్శ ప్రాయమైన జర్నలిస్టుల కాలనీని నిర్మించాలని ముఖ్యమంత్రిని కోరింది. సమావేశంలో అమరావతి జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ డైరెక్టర్లు ఈశ్వర్ (టీవీ9), నరసింహారావు (హెచ్‌ఎంటీవీ), శ్రీనివాస్ (మహా టీవీ), ది హిందూ డిప్యూటీ ఎడిటర్ శ్రీనాథ్, స్పెషల్ కరస్పాండెంట్ సాంబశివరావు, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ డిప్యూటీ రెసిడెంట్ ఎడిటర్ మల్లేశ్వరరావు, సీనియర్ సబ్ ఎడిటర్ అమీన్, బీబీసీ ఇన్‌చార్జి జి. ఉమాకాంత్, టైమ్స్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ ఎడిటర్ శ్రీకాంత్, ది పయనీర్ చీఫ్ ఆఫ్ బ్యూరో రవి కుమార్ బొప్పన, ఈనాడు సీనియర్ రిపోర్టర్ ఎం. శ్రీనివాసరావు, ఈటీవీ బ్యూరో చీఫ్ శ్రీనివాస మోహన్ పాల్గొన్నారు.
వీరితో పాటు ఆంధ్రప్రభ బ్యూరో చీఫ్ గోపీ, ఎన్‌టీవీ చీఫ్ రిపోర్టర్ ప్రసన్న, మహా టీవీ ఏపీ బ్యూరో చీఫ్ మురళీమోహన్, మాజీ విశాలాంధ్ర ఉప సంపాదకుడు ఎస్.కే. బాబు, దిశ సీనియర్ రిపోర్టర్ దారం వెంకటేశ్వరరావు, సీవీఆర్ బ్యూరో ఏడుకొండలు, సహకార భూమి ఎడిటర్ అక్బర్ పాషా, మాజీ ఆంధ్రభూమి న్యూస్ ఎడిటర్ నరసింహారావు, వార్త బ్యూరో చీఫ్ గంటా విజయ్ కుమార్, ప్రజాశక్తి స్టేట్ బ్యూరో పవన్, మాజీ డెక్కన్ క్రానికల్ బ్యూరో ఇన్‌చార్జి కృష్ణారావు, ఫొటోగ్రాఫర్లు దయానంద్, వెంకట్రామయ్య, ఆంధ్రపత్రిక సీఈఓ మాధవ్, 99 టీవీ బ్యూరో జి. సాంబశివరావు, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్టు శ్రీధర్ పాల్గొన్నారు.
