హైదరాబాద్ : సకల జీవకోటికి ప్రాణాధారంగా ఒకప్పుడు పేరుగాంచిన ప్రగతినగర్ (అంబీర్) చెరువు ఆనవాళ్లు కోల్పోయింది. నగరీకరణలో పరిసరాలన్నీ కాంక్రీట్ జంగిల్‌గా మారిపోగా.. వ్యర్థాలకు నిలయంగా మారింది. చికెన్, మాంసం, చేపల వ్యర్థాలతో దుర్గంధ భరితమైంది. దీంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సహజత్వాన్ని కోల్పోయిన చెరువుకు పునరుజ్జీవం ఇవ్వాలని స్థానికులు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ని కలిసారు. ఫర్ ఎ బెటర్ సొసైటీ ప్రతినిధులు కూడా ఇందులో ఉన్నారు. ప్రజావాణిలో ఫిర్యాదు కూడా చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు వెనువెంటనే అక్కడ పరిస్థితిని పరిశీలించి రంగంలోకి దిగింది హైడ్రా. ముందుగా చెత్త వేయకుండా జాగ్రత్తలు తీసుకుంది. చికెన్ వ్యర్థాలు వేయడానికి వచ్చిన 4 వాహనాలను హైడ్రా పట్టుకుంది. చెత్తను తొలగించే పనులను పెద్ద ఎత్తున చేపట్టింది.
ఇదిలా ఉండగా క్రిస్మస్ పడంగతో పాటు వారాంతం సెలవులున్నా హైడ్రా పనులు కొనసాగిస్తూనే వచ్చింది. 5 నుంచి 6 లారీలు, 3 జేసీబీలతో చెత్తను తొలగిస్తోంది. ఆపరేషన్ అంబీర్ చెరువు మాదిరి పనులు చేస్తూ ఏకంగా ఇప్పటి వరకు 104 లారీల చెత్తను హైడ్రా తరలించింది. చెరువు ఒడ్డున గుట్టలుగా చెత్త పేరుకు పోయిందని, మరో వంద లారీలకు పైగా ఉంటుందని అక్కడ పనులు చేపట్టిన అధికారులు చెబుతున్నారు. కూకట్‌పల్లి – ప్రగతినగర్‌లను కలుపుతూ ప్రగతినగర్ చెరువు మధ్యలోంచి వేసిన రోడ్డుకు ఇరువైపులా పూర్తిగా చెత్తను తొలగించాల్సి ఉందని అంటున్నారు. ఇక్కడ చిరు వ్యాపారులతో మాట్లాడి ప్రత్యామ్నాయ స్థలంలో అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. జీహెచ్ ఎంసీ, రెవెన్యూ అధికారులతో సమన్వయంతో పని చేస్తున్నారు. చెత్తను పూర్తిగా తొలగించి.. ఫెన్సింగ్ వేయాలని నిర్ణయించింది హైడ్రా.
















