హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన
కాంగ్రెస్ సర్కార్ ప్రతిపాదించిన ద్వేషపూరిత ప్రసంగ చట్టాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. సోమవారం రామచందర్ రావు మీడియాతో మాట్లాడారు. ఈ దేశంలో ఎవరైనా ఏదైనా మాట్లాడే హక్కు భారత రాజ్యాంగం కల్పించిందని, ఆవిషయం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ఈ చట్టం కావాలని తీసుకు వచ్చే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. ప్రజల హక్కులను కాల రాసే హక్కు ఏ సర్కార్ కు లేదన్నారు రామచందర్ రావు. కావాలని కాషాయ పార్టీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని బీజేపీని నామ రూపాలు లేకుండా చేసేందుకే ఈ చట్టాన్ని తీసుకు వస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ద్వేష పూరిత ప్రసంగ వ్యతిరేక చట్టంపై మండిపడ్డారు. తాము ఒప్పుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు బీజేపీ చీఫ్. హిందూ దేవుళ్లతో సహా అధికార పార్టీ నాయకులే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవలి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి చేసిన కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. మరి అలాంటి కామెంట్స్ ద్వేష పూరితం కాదా అని ప్రశ్నించారు రామచందర్ రావు. తెలంగాణ సర్కార్ ప్రతిపాదించ బోయే ఈ బిల్లు కర్ణాటక రాష్ట్రం తీసుకు వచ్చిన బిల్లుతో పోలి ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

















