అమరావతి : మహాన్నత మానవుడు దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్ పేయి అని కొనియాడారు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. గుంటూరు జిల్లా వెంకటాయ పాలెంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతి సందర్భంగా సుపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు కందుల దుర్గేష్. ప్రపంచ రాజకీయ చరిత్రలో భారతదేశ గౌరవాన్ని విశ్వ వేదికపై నిలబెట్టి రాజకీయ విలువలు, సిద్ధాంతాలతో కూడిన పాలనకు చిరునామాగా నిలిచిన అజాత శత్రువు , అరుదైన నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి అని పేర్కొన్నారు. సుపరిపాలనకు సరికొత్త నిర్వచనం ఇచ్చిన మహానేతగా ఆయన చరిత్రలో నిలిచి పోయారంటూ ప్రశంసలు కురిపించారు.
స్వర్ణ చతుర్భుజి, గ్రామ సడక్ యోజన, అంత్యోదయ, మౌలిక వసతుల అభివృద్ధి వంటి పథకాలతో దేశాభివృద్ధికి బలమైన పునాదులు వేసిన నేత వాజ్‌పేయి అని కొనియాడారు. పార్లమెంట్‌లో ఆయన చేసిన ప్రసంగాలు నేటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు కందుల దుర్గేష్. విదేశాంగ మంత్రిగా ప్రపంచానికి భారతదేశ గొప్పతనాన్ని చాటిచెప్పిన ఘనత వాజ్ పేయికి దక్కుతుందన్నారు. ప్రజా రాజధాని అమరావతిలో అటల్ బిహారీ వాజ్‌పేయి కాంస్య విగ్రహం, స్మృతి వనం ఏర్పాటు కావడం చారిత్రాత్మకమైన శుభ సందర్భంగా పేర్కొన్నారు మంత్రి. ఇది రాజకీయంగా, పరిపాలన పరంగా తరతరాలకు స్ఫూర్తిని కల్పిస్తుందని స్పష్టం చేశారు.
