తిరుపతి : తిరుపతి లోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతార మహోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండో రోజు రాత్రి శ్రీ సుందరరాజ స్వామివారు హనుమంత వాహనంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో దివ్య మంగళ విహారం చేసి భక్తులకు అభయ ప్రదమైన దర్శనమిచ్చి అనుగ్రహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి సహస్ర నామార్చన నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం శ్రీకృష్ణ స్వామి ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సుందర రాజస్వామి వారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీరు, పసుపు, చందనం తదితర పవిత్ర ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా మహాభిషేకం నిర్వహించారు.
సాయంత్రం స్వామి వారికి ఊంజల్ సేవను వైభవంగా నిర్వహించిన అనంతరం, హనుమంత వాహనంపై సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దివ్య దర్శనం కల్పించారు. అవతార మహోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం రాత్రి శ్రీ సుందరరాజ స్వామి వారు గరుడ వాహనాన్ని అధిరోహించి ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈవో దేవరాజులు, అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఉత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి (టిటిడి) ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.
