17 నుంచి శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు

శ్రీనివాస మంగాపురంలో ఆధ్యాత్మిక వైభవం

hellotelugu-KalyanaVenkateshwaraSwamy

తిరుపతి : శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు ఈ నెల జూలై 17 నుండి 19వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో మూడు రోజుల పాటు విశేష పూజలు, స్నపన తిరుమంజనం, ఊంజల్ సేవలు, వాహనసేవలు భక్తిశ్రద్ధలతో జరగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవ మూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు స్వామి వారికి ఊంజల్ సేవ వైభవంగా జరుగుతుంది.

మహోత్సవాల్లో భాగంగా జూలై 17న పెద్దశేష వాహనం, జూలై 18న హనుమంత వాహనం, జూలై 19న గరుడ వాహనంపై స్వామివారు రాత్రి 7 నుండి 8 గంటల వరకు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. ఉత్సవాలకు ముందుగా జూలై 16న ఉదయం 6.30 నుండి 11.30 గంటల వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణం, గర్భాలయం, పూజా సామగ్రిని పవిత్ర జలాలతో శుద్ధి చేసి, సుగంధ ద్రవ్యాలతో కలిపిన పవిత్ర తీర్థాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటల నుండి భక్తులకు దర్శనం కల్పిస్తారు.

సాక్షాత్కార వైభవోత్సవాల ముగింపు సందర్భంగా జూలై 20న శ్రీవారిమెట్టు సమీపంలోని మండపంలో ఉదయం 7 గంటలకు పార్వేట ఉత్సవం,ప్రత్యేక ఆస్థానం ఘనంగా నిర్వహించనున్నారు.ఉత్సవాల దృష్ట్యా జూలై 16న తిరుప్పావడ సేవ, అలాగే జూలై 16 నుండి 20వ తేదీ వరకు ఆర్జిత కల్యాణోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది.

Exit mobile version