హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం కల్పించే ప్రజాస్వామ్య పాలన అందించడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క.
80వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడారు. మహానీయుల త్యాగాల స్ఫూర్తితో 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో రైతు సంక్షేమం, విద్య, వైద్యం, సాగునీరు, మౌలిక వసతులు, మహిళా సాధికారత, గృహ నిర్మాణం, విద్యుత్, పర్యాటక రంగాల్లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామన్నారు.
రైతు భరోసా కింద 3,41,913 మంది రైతులకు రూ.427.97 కోట్లు, రుణమాఫీ కింద 1,31,760 మంది రైతులకు రూ.912.10 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా 1,38,790 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. 27 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించేందుకు మెకనైజ్డ్ కిచెన్లు, ఉచిత అల్పాహార పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు.
ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రూ.23.75 కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ భవనాన్ని పూర్తి చేసి, ఆధునిక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఖమ్మం నగరంలో మున్నేరు వరదల నియంత్రణకు రూ.525.36 కోట్లతో రక్షణ గోడ నిర్మిస్తున్నామని, రూ.1,583 కోట్లతో కోదాడ–ఖమ్మం జాతీయ రహదారి అభివృద్ధి పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో మహిళలకు 6.14 కోట్లకు పైగా ఉచిత బస్సు ప్రయాణాలు కల్పించామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం, గృహజ్యోతి, సోలార్ విద్యుత్, పర్యాటక అభివృద్ధి వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల సంక్షేమం, జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు.
















