హైదరాబాద్ : హైదరాబాద్ లో ఆక్రమణకు గురైన చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా కట్టబడి ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రోడ్లను విస్తరించుకుందాం. చెరువులను పునరుద్ధరించుకుందాం. నాలాల ఆక్రమణలను తొలగించుకుందాం. పిల్లలకు క్రీడా మైదానాలు కట్టుకుందాం. అభివృద్ధి చెందుతున్న ఒక మంచి నగరంగా అభివృద్ధి చేసుకుందాం అని పిలుపునిచ్చారు. కూకట్‌పల్లిలో హైడ్రా పునరుద్ధరించిన నల్ల చెరువును ముఖ్యమంత్రి ప్రారంభించారు. చెరువులో గంగమ్మ తల్లికి హారతినిచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమ సమర్పించారు. ఈ సందర్భంగా స్థానికులతో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.
దేశంలోని మెట్రో నగరాల్లో హైదరాబాద్ అత్యంత సురక్షితమైన నగరంగా ఉందన్నారు. అయితే, ఆక్రమణలు తొలగించి, కాలుష్యం నివారించి మూసీ నదిని పునరుద్ధరించు కోవలసిన అవసరం ఉందన్నారు. లేదంటే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవు అని హెచ్చరించారు. హైడ్రాను ఏర్పాటు చేసినప్పుడు, హైడ్రా పనులు ప్రారంభించినప్పుడు చాలా మంది నాపై విమర్శలు చేశారని గుర్తు చేశారు. ఇందులో నాకెలాంటి దురుద్దేశం లేదు. నల్లచెరువును పునరుద్ధరించిన తర్వాత వేలాది మంది మొహాల్లో ఆనందం చూసినప్పుడు సంతోషం కలిగిందన్నారు.
పునరుద్ధరించిన చెరువు పార్కుల చుట్టూ వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. స్టాల్స్ పెట్టాలి. పిల్లలు ఆడుకోవడానికి స్థలాల్లేవు. చెరువుల ఒడ్డున ఆటస్థలాలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ ప్రాంతంలో ఉన్న చెరువులన్నింటినీ పునరుద్ధరించు కోవాల్సిన అవసరం ఉందన్నారు.
