హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈసారి పాఠశాలలకు వారం రోజుల సంక్రాంతి సెలవులు ప్రకటించింది. జనవరి 10 నుండి 16 వరకు పాఠశాలలు మూసి వేయనున్నట్లు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి వెల్లడించారు. సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తిరిగి విద్యార్థుల తరగతులు 17వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పాఠశాల విద్యా శాఖ ఇంతకు ముందు జనవరి 11 నుండి జనవరి 15 వరకు ఐదు రోజుల సెలవులను ప్రకటించింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జనవరి 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమగా ప్రకటించింది.
జనవరి 10 రెండవ శనివారం కావడంతో ఇంతకు ముందు ప్రకటించిన సెలవులను సమీక్షించనున్నారు. దీని ప్రకారం జనవరి 10 నుండి జనవరి 16 వరకు సెలవులు పాటించ బడతాయి. పాఠశాలలు జనవరి 17, శనివారం తిరిగి తెరవబడతాయి. త్వరలో అధికారిక ప్రకటన జారీ చేయబడుతుందని విద్యా శాఖ స్పష్టం చేసింది. ఈ సందర్బంగా విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై. వారం రోజుల పాటు ఇవ్వడం పట్ల సీఎం అనుముల రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఏపీ కూటమి సర్కార్ సైతం భారీ సర్ ప్రైజ్ ఇచ్చింది. జగన్ రెడ్డి సర్కార్ కంటే ఎక్కువగా ఈసారి ఏపీ వాసులకు ఎక్కువ సెలవులు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రకటించారు. తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువగా సంక్రాంతి ఫెస్టివల్ ను ఘనంగా జరుపుకుంటారు.
















