మహిమాన్విత క్షేత్రం శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం

23 నుంచి 31వ తేదీ వ‌ర‌కు వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు

hellotelugu-GovindaRajaSwamy

తిరుపతి : తిరుపతి లోని శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో మే 23 నుండి 31వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు మే 22న శుక్ర‌వారం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. సాయంత్రం 5.30 నుండి 8 గంటల మధ్య ఈ కార్యక్రమం వైభవంగా జ‌రిగింది.ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి తోమాల, సహస్ర నామార్చన సేవలు నిర్వహించారు. అనంతరం సేనాధిపతి ఉత్సవం, గంగుండ్ర మండపంలో ఆస్థానం, యాగశాలలో శాస్త్రోక్త అంకురార్పణ కార్యక్రమాలు వైభ‌వంగా చేప‌ట్టారు.

ఆలయ ప్రాశస్త్యం విశిష్ట‌మైన‌దిగా భావిస్తారు భ‌క్తులు. కలియుగ వైకుంఠమైన తిరుపతిలో వెలసిన శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం భక్తి, చరిత్ర, శిల్పకళ, ఆగమ సంప్రదాయాల సమ్మేళనంగా యుగ యుగాలుగా భక్తులను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తోంది. ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించుకున్న భక్తులకు రుణ విమోచనం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక ఆనందం కలుగుతాయని స్థల పురాణం పేర్కొంటోంది. స్వామి వారి దివ్య మంగళ విగ్రహం భక్తుల హృదయాలలో విశ్వాసాన్ని నింపుతూ, జీవన సాఫల్యానికి మార్గదర్శకంగా నిలుస్తోంది.

పురాణాల ప్రకారం, శ్రీ మహావిష్ణువు భూలోకంలో శ్రీనివాసుడిగా అవతరించి తిరుమలలో నివసించే సమయంలో వివాహ మహోత్సవం నిమిత్తం కుబేరుని వద్ద నుండి ధనం అప్పుగా తీసుకున్నారని విశ్వసిస్తారు. ఆ ధనాన్ని కొలిచే బాధ్యతను శ్రీనివాసుడి అన్నయ్య అయిన శ్రీ గోవిందరాజ స్వామివారికి అప్పగించారని స్థల పురాణం తెలియ జేస్తోంది. ధనాన్ని కొలుస్తూ అలసిన స్వామి వారు ఆదిశేషునిపై శయనించిన దివ్య రూపమే నేటి శ్రీ గోవిందరాజ స్వామివారి దర్శనమని భక్తుల విశ్వాసం.

ఆదిశేషునిపై శయనిస్తున్న స్వామివారు గర్భాలయంలో దివ్య కాంతులతో దర్శనమిస్తూ భక్తుల హృదయాలకు ప్రశాంతతను ప్రసాదిస్తున్నారు. స్వామివారి నాభి నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించినట్లు, పాదాల వద్ద శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, మోక్షం కోసం తపస్సు చేస్తున్న మధు–కైటభ రాక్షసులు కొలువై ఉన్న దృశ్యం భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతోంది.

Exit mobile version