హైదరాబాద్ : రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా తెలంగాణలో జరిగిన యధార్థ ఘటన ఆధారంగా తెరకెక్కించిన చిత్రం దండోరా. ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్ తో ప్రదర్శిస్తోంది. ఈ సందర్బంగా దండోరా సినిమా గురించి స్పందించారు మంత్రి. తన మనసులోని మాటలను బయట పెట్టారు. చిత్రం ప్రతి ఒక్కరినీ హత్తుకునేలా ఉందంటూ ప్రశంసలు కురిపించారు. ఇలాంటి సినిమాలు తెలంగాణ ప్రాంతం నుంచి రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దండోరా టీంను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ నేల నుంచి పుట్టిన ఈ చిత్రం సామాజిక అంశాలను మనసును తాకేలా ఆవిష్కరించిందని అన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాలను కలుపుతుందన్న ఆశా భావం వ్యక్తం చేశారు. గ్రామీణ జీవనశైలి, మనుషుల మధ్య ఉన్న సూక్ష్మ సంబంధాలను సహజంగా చూపిస్తూ నిజ జీవితానికి అద్దం పట్టేలా దర్శకుడు దండోరాను తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉందంటూ కొనియాడారు. మన చుట్టూ నిత్యం కనిపిస్తూనే పట్టించుకోని ఒక సామాజిక సమస్యను సున్నితంగా ప్రశ్నిస్తూ ఆలోచనకు దారితీసే సినిమానే ఈ దండోరా అని పేర్కొన్నారు. “బలగం” తర్వాత అదే స్థాయిలో హృదయాన్ని తాకిందంటూ పేర్కొన్నారు.



















