హైదరాబాద్ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక ప్రకటన చేశారు. తాము కొత్తగా తీసుకు వచ్చిన ఎరువుల క్రయ విక్రయాలు, వినియోగానికి సంబంధించిన యాప్ సక్సెస్ అయ్యిందని చెప్పారు. రైతుల సౌకర్యార్థం వ్యవసాయ కమిషనరేట్‌లో 18005995779 టోల్-ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ‘ఎరువుల బుకింగ్ యాప్’ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైందని వ్యవసాయ శాఖ మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. తొమ్మిది రోజుల వ్యవధిలో ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, జనగాం, నల్గొండ , పెద్దపల్లి జిల్లాల్లోని 82,059 మంది రైతులు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నారని చెప్పారు.
2,01,789 బస్తాల యూరియాను కొనుగోలు చేశారని వెల్లడించార. యాప్ పనితీరు , యూరియా పంపిణీని సమీక్షించడానికి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఈ విషయాలు చెప్పారు. ఎరువుల కొరతపై ఉన్న ఆందోళనలను తొలగిస్తూ, రబీ సీజన్‌కు రాష్ట్రంలో తగినంత యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఆయన అన్నారు. కేంద్రం రబీ సీజన్‌కు 10.4 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్‌ఎంటీ) యూరియాను కేటాయించగా, 5.7 ఎల్‌ఎంటీ తెలంగాణకు చేరిందన్నారు. గత ఏడాది ఇదే కాలంలో 2.81 ఎల్‌ఎంటీ యూరియాను కొనుగోలు చేయగా, ఈ ఏడాది రైతులు 3.72 ఎల్‌ఎంటీ యూరియాను కొనుగోలు చేశారని తెలిపారు. రాష్ట్రంలో 2.15 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందని ఆయన చెప్పారు.















