హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి రథచక్రాల వంటి వారని అన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఆయన వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు శాసన సభలో. వాళ్లు సంతోషంగా ఉంటేనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సజావుగా చేరుతాయని అన్నారు. ఆ సోయి లేక పోతే ఎలా అని ప్రశ్నించారు. నేడు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ తీవ్రమైన మనోవేదనలో ఉన్నారని అన్నారు హరీశ్ రావు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పీఆర్సీ ఇస్తామని, పెండింగ్ డీఏలు, బకాయిలు చెల్లిస్తామని, ఓపీఎస్ తెస్తామని మాట ఇచ్చారని అన్నారు. కానీ రెండేళ్లయినా అమలు చేయకుండా ఉద్యోగులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
తక్షణమే ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, పోలీసులకు ఇచ్చిన హామీ ప్రకారం బకాయిలు విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఐదు సరెండర్ లీవులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. టీఏ, డీఏలు,స్టేషన్ అలవెన్సులు రావడం లేదన్నారు. రాష్ట్రంలో లక్ష మంది పోలీసులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హరీశ్ రావు. గతంలో తమ ప్రభుత్వం ఎప్పటికప్పుడు వీటిని విడుదల చేసిందని గుర్తు చేశారు. పోలీసులకు ఉన్న ఆరోగ్య భద్రత స్కీమును బంద్ చేసి, కేవలం లక్ష రూపాయలకే పరిమితం చేయడం దారుణమన్నారు. కానిస్టేబుళ్లు చాలా ఇబ్బంది పడుతున్నారని, ఆరోగ్య భద్రత పథకాన్ని పునరుద్ధరించి కార్పొరేట్ హాస్పిటల్స్‌లో వైద్యం అందేలా చూడాలని కోరారు హరీశ్ రావు.
