హైదరాబాద్ : హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. తాను సీపీగా పదవీ బాధ్యతలు చేపట్టాక నగరంలో క్రైమ్ రేట్ శాతం తగ్గిందని పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2025 వార్షిక నివేదికను విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే 2025లో మొత్తం నేరాలలో 15 శాతం తగ్గుదల నమోదైనట్లు నివేదించారు, ఇది శాంతిభద్రతల అమలు సామర్థ్యం , ప్రజల భద్రతలో ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుందని పేర్కొన్నారు సీపీ. ఈ సంవత్సరాన్ని వ్యూహాత్మక పరివర్తన, డిజిటల్ పోలీసింగ్ ,బలమైన సమాజ విశ్వాసం గల సంవత్సరంగా అభివర్ణించారు వీసీ సజ్జనార్. నేరాలకు సంబంధించిన కేసులు 2024లో 35,944 నమోదు కాగా 2025లో 30,690కి తగ్గాయని తెలిపారు. ఇందులో ఆస్తి సంబంధిత నేరాలలో 28 శాతం తగ్గగా, శారీరక నేరాలలో 16 శాతం తగ్గిందన్నారు.
ఇక బీఎన్ఎ్, ఎస్ఎల్ఎల్ కింద నమోదైన కేసులలో 14 శాతం తగ్గుదల, ఆస్తి సంబంధిత నేరాలలో 31 శాతం తగ్గుదల జరిగితే , మహిళలపై నేరాలకు సంబంధించి మాత్రం 6 శాతం పెరిగాయని పేర్కొన్నారు సీపీ సజ్జనార్. బాలలపై లైంగిక వేధింపుల కేసులు (పోక్సో) 27 శాతం పెరగడం పట్ల కొంత ఆందోళన వ్యక్తం చేశారు. డీజీపీ బి. శివధర్ రెడ్డి ప్రారంభించిన జాగృత హైదరాబాద్ – సురక్షిత హైదరాబాద్ కింద సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. డిజిటల్ మోసాలు, ఫిషింగ్, డీప్‌ఫేక్ స్కామ్‌లు, చట్ట విరుద్ధమైన యాప్‌ల గురించి ఇంటింటికీ అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు సీపీ.



















