కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ మొద‌లైంది : కేటీఆర్

ఎన్ని అరాచ‌కాలు చేసినా గులాబిదే హ‌వా

helloteelugu-KTR

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు చేసినా మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠాలను భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ కైవసం చేసుకోవడం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్బంగా
మున్సిపల్ ఛైర్మన్, వైస్ చైర్మన్లుగా ఎన్నికైన వారికి హృదయ పూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేసిన పార్టీకి చెందిన నేత‌లు, కార్య‌ర్త‌లు, శ్రేణుల‌కు పేరు పేరునా అభినందించారు కేటీఆర్.

అడ్డదారుల్లో చైర్మ‌న్, వైస్ చైర్మ‌న్ ప‌ద‌వుల‌ను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా, రకరకాలుగా ఒత్తిళ్లు తెచ్చినా వేటికి లొంగకుండా మొక్కవోని దీక్షతో ఒక్క తాటిపై నిలిచిన కౌన్సిలర్లకు ప్రత్యేకంగా సెల్యూట్ చేస్తున్నాన‌ని అన్నారు మాజీ మంత్రి. క్యాతనపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు మిత్రపక్షమైన సిపిఐ కామ్రేడ్లు అడుగడుగునా కనబరిచిన పోరాట పటిమ ఎంతో స్ఫూర్తిదాయకం అని ప్ర‌శంసించారు కేటీఆర్. అణచివేతకు, బెదిరింపులకు, అవినీతి అక్రమాలకు, అప్రజాస్వామిక చర్యలకు తెలంగాణలో తావులేదని ఈ తీర్పు తేల్చి చెప్పిందన్నారు.

రెండున్నర ఏళ్లలోనే పీకల్లోతు ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకున్న కాంగ్రెస్ కు ప్రజాక్షేత్రంలో కౌంట్ డౌన్ మొదలైందని ఈ ఫలితాలు నలుదిశలా చాటి చెప్పాయన్నారు. అటు పంచాయతీ, ఇటు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ముచ్చెమటలు పట్టించిన గులాబీ జెండా సైనికులను పార్టీ ఎప్పటికీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని స్ప‌ష్టం చేశారు కేటీఆర్.

Exit mobile version