హైదరాబాద్ : పాలమూరు జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డి చేసినన్నీ పచ్చి అబద్దాలేనని అన్నారు మాజీ మంత్రి లక్ష్మా రెడ్డి. ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ హయాంలోనే జిల్లాలో అభివృద్ది పనులు జరిగాయని చెప్పారు. వాటిని గమనించకుండా ఇష్టానుసారం మాట్లాడటం సీఎంకు తగదన్నారు. ఆయన అత్యున్నతమైన పదవిలో ఉన్నాననే సోయి లేకుండా మాట్లాడుతుండడం బాధాకరమని అన్నారు లక్ష్మారెడ్డి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఇకనైనా జాగ్రత్తగా మాట్లాడితే తనకే మంచిదని హితవు పలికారు. ప్రజా పాలన సాగిస్తామని పదే పదే చెబుతున్నా ఆచరణలో మాత్రం రాచరిక పాలన రాష్ట్రంలో కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరును ఇప్పుడు పడావు పెట్టింది మీరు కాదా అని ప్రశ్నించారు.
ఇకనైనా ఆరోపణలు, నిరాధారమైన విమర్శలు చేయడం మానుకోవాలని పాలమూరు జిల్లా అభివృద్ది కోసం ప్రయత్నం చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. విద్యా, వైద్యం, ఉపాధి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. కేవలం మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు అడుగులు కూడా దాటడం లేదంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి లక్ష్మా రెడ్డి. మంత్రుల మధ్య సమన్వయం లేకుండా పోయిందని, ఎవరు ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదన్నారు. ఒక బాధ్యత కలిగిన సీఎం మాజీ సీఎం కేసీఆర్ పై వ్యక్తిగతంగా నోరు పారేసు కోవడం సబబు కాదన్నారు. బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లక్ష్మా రెడ్డి.
