అమరావతి : ఏపీకి చెందిన తోతాపూరి మామిడి రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కేంద్ర సర్కార్ కృషి చేయలని కోరారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. నష్టాలను భర్తీ చేయడానికి , మామిడి సేకరణకు మద్దతుగా పీడీపీఎస్ కింద రూ. 281 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి కోరారు. ధరలు భారీగా పడిపోవడం, మామిడి గుజ్జు ఎగుమతులకు అంతరాయం కలగడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని తోతాపురి మామిడి రైతులకు తక్షణ మద్దతు అందించాలని విన్నవించారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఆయన ఇవాళ లేఖ రాశారు. మార్కెట్ జోక్య కార్యక్రమం కింద ‘ధరల వ్యత్యాస చెల్లింపు పథకం’ ను అమలు చేయాలని ముఖ్యమంత్రి అభ్యర్థించారు. రైతులను భారీ నష్టాల నుండి రక్షించడానికి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని అన్నారు.
ఏపీలో 3.99 లక్షల హెక్టార్లలో మామిడి సాగు జరుగుతోందని పేర్కొన్నారు. ఏటా 52.65 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో దేశంలోనే మామిడి ఉత్పత్తిలో ఏపీ అగ్రస్థానంలో ఉందని నాయుడు వివరించారు. వాణిజ్య పరంగా కీలకమైన తోతాపురి మామిడి రకం, రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య , వైఎస్ఆర్ కడపలలో దాదాపు 91,011 హెక్టార్లలో సాగు చేయబడుతోందని వెల్లడించారు. ఇది సుమారు 8.65 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడిని ఇవ్వడమే కాకుండా, లక్షలాది రైతు కుటుంబాలకు జీవనోపాధిని కల్పిస్తోందని చెప్పారు. అంతర్జాతీయ పరిణామాలు మామిడి గుజ్జు ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపాయని, అదే సమయంలో ప్రాసెసింగ్ పరిశ్రమలు సేకరణను తగ్గించాయని, దీనివల్ల దేశీయ మార్కెట్‌లో తోతాపురి మామిడి ధరలు భారీగా పడిపోయాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
