అమరావతి : ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఐఎండీ) కీలక ప్రకటన చేసింది. ఉత్తరాంధ్ర తీరప్రాంతం నుండి ఛత్తీస్‌గఢ్ మీదుగా మహారాష్ట్ర వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. అంతర్గత కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమోరిన్ ప్రాంతం వరకు మరోక ద్రోణి విస్తరించి ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో మరో రెండు రోజులు మేఘావృతమైన వాతావరణంతో పాటు చెదురు మదురుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదిలా ఉండగా సోమవారం కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు.
మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందన్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటల నాటికి గుంటూరు జిల్లా మంగళగిరిలో 68.2 మిమీ, విజయనగరం జిల్లా రాజాంలో 52.5 మిమీ, గుంటూరు జిల్లా కాకుమానులో 51.5 మిమీ, తాడేపల్లిలో 45.2 మిమీ, ఎన్టీఆర్ జిల్లా కవులూరులో 41.5 మిమీ, బాపట్ల జిల్లా భట్టిప్రోలు 39.9 మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.
ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని సూచించారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వీలైనంత దూరంగా ఉండాలన్నారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు,శ్రామికులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు.
