న్యూఢిల్లీ : ఎంపీ ప్రియాంక గాంధీ నిప్పులు చెరిగారు. మోదీ బీజేపీ సర్కార్ పై భగ్గుమన్నారు. గురువారం ఆమె లోక్ సభ సాక్షిగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపించారు. వారికి పేదలంటే చులకన భావం ఉందన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి పథకం పేరును మార్చడం దారుణమన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఈ బిల్లు పేదలకు వ్యతిరేకంగా ఉంటోందన్నారు. తాము ఈ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలియ చేస్తామన్నారు.
ఈ బిల్లు రాబోయే నెలల్లో ముగుస్తుందని చెప్పారు. పూర్తిగా భారమంతా రాష్ట్రాలపై పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రియాంక గాంధీ.
దేశ వ్యాప్తంగా లక్షలాది గ్రామీణ కుటుంబాలకు మద్దతు ఇచ్చే సంక్షేమ పథకాన్ని బలహీనపరిచే విధంగా సర్కార్ ప్రయత్నం చేయడం దారుణమన్నారు. ఈ బిల్లు అమలు రాష్ట్ర ప్రభుత్వాలపై అనవసరమైన బాధ్యతను మోపుతుందని ప్రియాంక గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టం బిల్లు భవిష్యత్తుకు ముప్పు కలిగిస్తుందని అన్నారు. లోక్ సభలో పాల్గొన్న అనంతరం ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడారు. మీరు ఏ విధంగా చూసినా, ఏ తెలివైన వ్యక్తి అయినా దీనిని అర్థం చేసుకుంటారని అన్నారు. ఇది 100 నుండి 125 రోజులకు సంబంధించిన ఒక తెలివైన ఎత్తుగడ. ఎవరైనా ఈ బిల్లును చదివితే, ఈ మొత్తం పథకం రాబోయే నెలల్లో ముగిసి పోతుందని స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు. ఇదిలా ఉండగా లోక్‌సభ వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) బిల్లు, 2025ను ఆమోదించింది.
