జర్మనీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు మోదీ కేంద్ర ప్రభుత్వంపై. జర్మనీ పర్యటనలో ఆయన బిజీగా ఉన్నారు. ఈ సందర్బంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఫ్యాక్టరీని ఎంపీ సందర్శించారు. మీడియాతో మాట్లాడారు రాహుల్ గాంధీ. గత కొన్నేళ్లుగా దేశంలో కొలువు తీరిన బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు తయారీ రంగానికి సంబంధించి ఎలాంటి పాలసీలను తీసుకు వచ్చిన దాఖలాలు లేవన్నారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. భారతదేశంలో తయారీ పట్ల వివక్ష ప్రదర్శించడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం కొందరు వ్యాపారవేత్తలకు లబ్ది చేకూర్చేలా చర్యలు తీసుకుంటుండడం దారుణమన్నారు రాహుల్ గాంధీ. రోజు రోజుకు భారతీయ రూపాయి విలువ క్షీణిస్తోందని పేర్కొన్నారు.
అయినా సోయి లేకుండా సర్కార్ ఉంటోందంటూ ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశం కోసం పని చేయడం లేదని, ఆయన విహార యాత్రలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు బొక్క పడటం తప్ప దేశానికి ఒరిగింది ఏమీ లేదన్నారు ఎంపీ. ఓ వైపు ప్రపంచ మార్కెట్ లో రోజు రోజుకు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తోందంటూ చైనా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. విస్తృతమైన మానవ వనరులు ఉన్నప్పటికీ ఎందుకు ఇప్పటి వరకు కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయలేదంటూ ప్రశ్నించారు రాహుల్ గాంధీ. ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో సైతం చైనా తన దూకుడు ప్రదర్శిస్తోందని అన్నారు.

















