అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సచివాలయంలో టీడీపీ చీఫ్, సీఎం నారా చంద్రబాబు నాయుడు, బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ లతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు డిప్యూటీ సీఎం. తిరుమల లడ్డూకి వినియోగించిన నెయ్యి పాల నుంచి వచ్చింది కాదని సీబీఐ తేల్చిందని అన్నారు. కల్తీ నెయ్యి కేసులో సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వలేదని చెప్పారు. కల్తీ నెయ్యితో చేసిన లడ్డూలనే ఆయోధ్య రామమందిర విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి పంపించారని , దీనికి బాధ్యత వహించాల్సింది మీరేనంటూ జగన్ రెడ్డి, వైవీ సుబ్బా రెడ్డిలను ఉద్దేశించి స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ కొణిదల.
కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా చర్యలు తీసుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ విశ్వాసాలపై దాడి జరిగిందన్నారు. తప్పు చేసినవారు ఏడుకొండల వాడికి క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. కల్తీ నెయ్యి దోషుల్ని కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. . ఏడుకొండల వాడికి రెండు కొండలు చాలన్న వారసత్వం వారిదంటూ ఎద్దేవా చేశారు. తిరుమల పవిత్రతను దిగజార్చేందుకు ఏ స్థాయికైనా దిగజారుతారంటూ మండిపడ్డారు డిప్యూటీ సీఎం. భగవంతుడి మీద పగ పట్టిన వారు మట్టికొట్టుకు పోతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

















