అమరావతి : ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది. మందు బాబులకు మరింత తాగేందుకు వీలుగా మద్యం విక్రయాల సమయాన్ని పొడిగించాలని నిర్ణయించింది. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. నూతన సంవత్సరం వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా మద్యం విక్రయాలు, సేవల సమయాలను పొడిగించేందుకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి అనుమతి మంజూరు చేశారు. ఎక్సైజ్ , ప్రొహిబిషన్ డైరెక్టర్ సమర్పించిన నివేదికను అనుసరించి నిర్ణయం తీసుకున్నారు.ఈ ప్రత్యేక అనుమతులను అనుసరించి ఏ4 మద్యం దుకాణాలు డిసెంబర్ 31, జనవరి 1, 2026 రాత్రుల్లో అర్ధరాత్రి 12.00 గంటల వరకు మద్యం విక్రయించ వచ్చని స్పష్టం చేశారు.
అలాగే 2B (బార్లు), సి 1 (ఇన్-హౌస్), ఈపిఐ(ఈవెంట్ పర్మిట్), టీడీ1 (ఇన్-హౌస్) లైసెన్సులు కలిగిన ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంస్థలు అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయించడానికి, రెస్టారెంట్ సర్వీస్ లకు అనుమతి ఇవ్వడం జరిగిందని తెలిపారు. గత ఏడాది నూతన సంవత్సరం సందర్భంగా అమలులో ఉన్న విధానానికి అనుగుణంగా ఈ సడలింపు ఇచ్చినట్లు ఈ సందర్బంగా సర్కార్ వెల్లడించింది. ఈ సందర్భంగా నాన్-డ్యూటీ పెయిడ్ మద్యం లేదా అక్రమ మద్యం విక్రయాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.
ఈ ఆదేశాల అమలుకు ఎక్సైజ్, ప్రొహిబిషన్ డైరెక్టర్, ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ లు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులలో స్పష్టం చేసింది.















