ఏసీబీ దెబ్బ‌కు ర‌వాణా శాఖ‌లో క‌ల‌క‌లం

దాడులు చేప‌ట్టాల‌ని సీఎం ఆదేశం

hellotelugu-ACBRaaids

హైద‌రాబాద్ : డీజీ చారు సిన్హా ఆధ్వ‌ర్యంలోని తెలంగాణ అవినీతి నిరోధ‌క శాఖ (ఏసీబీ) దూకుడు పెంచింది. ఎక్క‌డ చూసినా దాడుల‌ను ముమ్మురం చేసింది. దాని స్పీడ్ కు అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్న వారి గుండెల్లో రైళ్లు ప‌రుగులు పెడుతున్నాయి. తాజాగా చేప‌ట్టిన వాటిలో ఏకంగా అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ కూడా ప‌ట్టుపడ్డాడు. అంతే కాదు తాజాగా మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ఆర్టీఓ ఆఫీస్ లో డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ అధికారిగా ప‌ని చేస్తున్న కిష‌న్ నాయ‌క్ ను రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్నారు. త‌ను సంపాదించిన ఆస్తుల‌ను చూసి ఏసీబీ అధికారులే విస్తు పోయారు. లెక్క‌కు మించిన ఆస్తుల‌తో పాటు భారీ ఎత్తున బంగారం ప‌ట్టుబ‌డింది. ఏకంగా త‌న మార్కెట్ విలువ రూ. 250 కోట్ల‌కు పైగా ఉంటుంద‌ని అంచ‌నా.

దీంతో ఏసీబీ దెబ్బ‌కు ప‌లువురు ముంద‌స్తుగానే త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం విస్తు పోయేలా చేసింది. ఏసీబీ దాడుల నేప‌థ్యంలో కీల‌క‌మైన స‌మావేశం ఏర్పాటు చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఈ సంద‌ర్బంగా సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ దాడులు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. దాడుల నేప‌థ్యంలో అధికారులు నిష్క్ర‌మించ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది. ఎవ‌రైనా స‌రే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు. తొలిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా రవాణా అధికారులు, మోటారు వాహన ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులపై ఏసీబీ పూర్తిగా ఫోక‌స్ పెట్టింది. భారీ వాహనాలు, కార్లు, ద్విచక్ర వాహనాలు సహా వాహనాల రిజిస్ట్రేషన్లు గణనీయంగా పెరగడం ర‌వాణా శాఖలో అవినీతికి ఆజ్యం పోసిందని ఏసీబీ డీజీ చారు సిన్హా ప్ర‌క‌టించారు.

Exit mobile version