హైదరాబాద్ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో తమ పార్టీకి చెందిన అభ్యర్థులకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు స్పష్టం చేశారు జనసేన తెలంగాణ పార్టీ చీఫ్ నేమూరి శంకర్ గౌడ్, ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్ రెడ్డి. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో 330 పైగా జనసేన అభ్యర్థులు పోటీలో నిలిచారని చెప్పారు. మంచిర్యాల్ కార్పొరేషన్ లో 34వ డివిజన్ నుండి జనసేన కార్పొరేటర్ అభ్యర్థి అగ్గు సాగర్ 31 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగిందన్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో 14 వ వార్డు నుండి 29 ఓట్ల మెజారిటీతో జనసేన అభ్యర్థి ఆరూరి విజయలక్ష్మి నాగేశ్వరరావు విజయం సాధించారని తెలిపారు.
ఈ ఎన్నికలలో జనసేన పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు, వీర మహిళలు అందరూ ఉన్న తక్కువ సమయంలో చాలా కష్టపడి పని చేశారని ప్రశంసించారు. పార్టీ చీఫ్ , ఏపీ డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ తరుపున, తెలంగాణ రాష్ట్ర నాయకుల తరుపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రెండు చోట్ల గెలవడం సంతోషంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తాం అన్నారు. రాదారం రాజలింగం మాట్లాడుతూ అతి తక్కువ సమయంలో కష్టపడి పని చేసిన నాయకులకు పార్టీ శ్రేణులకు, గెలిచిన ఇద్దరు అభ్యర్థులకి హృదయ పూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు.
