హైదరాబాద్ : మచిలేశ్వర స్వామి, ఓంకారేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక చారిత్రాత్మక మందిరాన్ని నిర్మించు కోవడం ఒక చారిత్రక సందర్భం అని పేర్కొన్నారు. ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఇది జరుగుతుందని అనుకోవట్లేదని అన్నారు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారని, ఇది దైవేచ్ఛతో జరుగుతున్న కార్యక్రమం అని పేర్కొన్నారు. 8 ఎకరాల్లో 700 కోట్లతో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పారు సీఎం. ఈ ప్రాంతానికి 1400 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. ఈ చరిత్ర కనుమరుగు కాకుండా భవిష్యత్ తరాలకు అందించాలన్నదే మా ప్రభుత్వ ఆలోచన అని స్పష్టం చేశారు.
మూసీ నది పునరుజ్జీవింపై చాలా మంది ప్రయత్నించారని, కారణాలు ఏవైనా ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదని అన్నారు. ఆ అవకాశం మనకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాం అని అన్నారు. విమర్శలు వచ్చినా, అడ్డంకులు సృష్టించినా దేవుడే వాటిని తొలగిస్తాడని పేర్కొన్నారు. తెలంగాణ పౌరులకు నా విజ్ఞప్తి ఒక్కటే చరిత్రను గమనిస్తే నది పరీవాహకంలోనే నాగరికత అభివృద్ధి చెందిందని మరిచి పోవద్దన్నారు. సముద్ర పరీవాహకంలో వ్యాపారం, ఆర్ధిక అభివృద్ధి జరిగిందని గుర్తించాలన్నారు సీఎం. దేశంలో సముద్రపు ఒడ్డు లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని చెప్పారు. మూసా, ఈసా నదులు ఉన్నా సరైన విధంగా ఉపయోగించు కోలేదని ఆరోపించారు. మానవ తప్పిదాలతోనే మూసీ కాలుష్యకారకంగా మారిందన్నారు.



















