అమరావతి : తెలుగు జాతి ఆత్మ గౌరవ ప్రతీక తెలుగుదేశం పార్టీ అని అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైందని అన్నారు. మన ఆరాధ్య దైవం, యుగ పురుషుడు దివంగత నందమూరి తారక రామారావు స్థాపించిన ఈ పసుపు జెండా సాక్షిగా, అపర చాణక్యుడిగా పేరు పొందిన సీఎం నారా చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశంలో, యువ సంచలనం, నారా లోకేష్ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రమాణ స్వీకారం చేయడం గర్వంగా ఉందన్నారు.
లోకేష్ బాబు అంటే కేవలం ఒక నాయకుడు కాదన్నారు. ఆనాడు అరాచక శక్తులపై అలుపెరగని పోరాటం చేసిన ఒక నిప్పుకణం అని ప్రశంసించారు. గత ఐదేళ్ల కాలంలో సైకో జగన్ రెడ్డి సాగించిన విధ్వంసకర పాలనను, అక్రమ కేసులను ఎదుర్కొని సింహ స్వప్నంలా నిలిచిన ధీశాలి అని కొనియాడారు. యువగళం పాదయాత్ర ద్వారా వేల కిలోమీటర్లు నడిచి, ప్రజల కష్టాలను కళ్లారా చూసి, వారి గుండెల్లో ధైర్యాన్ని నింపిన ప్రజా నాయకుడు లోకేష్ బాబు అని పేర్కొన్నారు అచ్చెన్నాయుడు.
రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడంలో, ఐటీ రంగానికి ఊపిరి పోయడంలో , భారీగా పెట్టుబడులను ఆకర్షించడంలో ఆయన చూపుతున్న విజన్ అమోఘం అన్నారు. లోకేష్ బాబుతో నాకు ఉన్న అనుబంధం ఎంతో విశిష్టమైనది, పార్టీ పట్ల ఆయనకున్న అంకితభావం మా అందరిలోనూ కొత్త ఉత్తేజాన్ని నింపుతోందన్నారు. 252 మంది సభ్యులతో కూడిన నూతన కార్యవర్గం ఏర్పాటు కావడం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు అని అభివర్ణించారు. చంద్రబాబు నాయుడు అనుభవం, లోకేష్ బాబు పనితీరుతో ఈ రాష్ట్రం మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
