ఆదివాసులకు అవగాహన పర్యటనలు 

చేప‌ట్టిన తెలంగాణ ప‌ర్యాట‌క శాఖ

hellotelugu-adilabadAdivasis

హైద‌రాబాద్ : హైదరాబాద్‌లో ఆదివాసులకు అవగాహన పర్యటనలు చేపట్టింది తెలంగాణ పర్యాటక శాఖ .ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ మండలానికి చెందిన 250 మంది ఆదివాసుల బృందం బుధ, గురువారాల్లో తారామతి బారాదరి సాంస్కృతిక సముదాయం, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, చార్మినార్, నెహ్రూ జంతు ప్రదర్శనశాల వంటి పలు ఆకర్షణీయ ప్రదేశాలను సందర్శించింది. ఆదిలాబాద్ జిల్లాలోని గోండు గూడెంలో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు జెండా ఊపి ప్రారంభించిన ఐదు ఏసీ బస్సుల్లో ఆదివాసులు హైదరాబాద్ చేరుకున్నారు. ఆదివాసులకు కొత్త దృక్పథాలను అందించడం, వారిని పట్టణ జీవనశైలికి పరిచయం చేయడం, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచడం కోసం ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు మంత్రి తెలిపారు. గత ఏడాది డిసెంబర్‌లో తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన చెప్పారు.

తెలంగాణ పర్యాటక శాఖ ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా దీనికి శ్రీ‌కారం చుట్టింద‌న్నారు మంత్రి. మారుమూల ప్రాంతాల ఆదివాసీలకు హైదరాబాద్‌లోని కీలక పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు వీలు కల్పిస్తోందన్నారు. తద్వారా వారికి ఆధునిక పట్టణ జీవన విధానాన్ని పరిచయం చేస్తోందన్నారు. గత ఏడాది డిసెంబర్‌లో తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలోని కుమ్మరి కుంట గ్రామాన్ని సందర్శించిన విషయాన్ని గుర్తు చేశారు. 1,800 మంది వ్యక్తుల సమూహంలో కేవలం నలుగురు మాత్రమే హైదరాబాద్‌ను సందర్శించారని తెలుసుకుని తాను ఆశ్చర్యపోయానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా, ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ద్వారా సందర్శకులను ఎంపిక చేసినట్లు తెలిపారు.

Exit mobile version